Aloo Pulao Recipe:లంచ్ బాక్స్ లోకి చిటికెలో చేసే కమ్మని “ఆలూ పులావ్” సింపుల్ గా ఇలా చేసేయండి..
Aloo Pulao:పులావ్ అనేక రకాలుగా ఉంటుంది, అందులో ఆలూ పులావ్ ఒక ప్రత్యేకమైన రుచికరమైన వంటకం. సుగంధ ద్రవ్యాలు, బంగాళదుంపలు, బాస్మతి బియ్యంతో తయారయ్యే ఈ ఆలూ పులావ్ అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఏ వయస్సు వారైనా దీన్ని ఆస్వాదించవచ్చు.
దీనికి సైడ్ డిష్‌గా కర్రీ అవసరం లేకుండానే ఒక్కటిగా తినొచ్చు. ఈ వంటకం తయారు చేయడం చాలా సులభం, బ్యాచిలర్స్ కూడా తమ రూమ్‌లో సులభంగా రెడీ చేసుకోవచ్చు. కొద్ది నిమిషాల్లో తయారయ్యే ఈ ఆలూ పులావ్‌ను మీ ఇంట్లో చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఆలూ పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు:
– బంగాళదుంప
– పచ్చిమిర్చి
– ఉల్లిపాయ
– పచ్చి బఠాణీ
– క్యారెట్
– షాజీరా
– బిర్యానీ ఆకు
– దాల్చిన చెక్క
– ఉప్పు
– యాలకలు
– జాపత్రి
– మరాఠీ మొగ్గ
– లవంగ మొగ్గలు
– నూనె
– కొత్తిమీర
– పుదీనా
– బాస్మతి బియ్యం
– టమాటో
– అల్లం వెల్లుల్లి పేస్ట్
– కారం
– గరం మసాలా
తయారీ విధానం:
1. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి.
2. నూనె వేడెక్కిన తర్వాత, 1 టీస్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 4 యాలకలు, 1 జాపత్రి, 5 లవంగ మొగ్గలు, 1 మరాఠీ మొగ్గ, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి వేయించాలి.
3. మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ చీలికలు, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి వేపాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారిన తర్వాత, 1 కప్పు బంగాళదుంప ముక్కలు, అర కప్పు క్యారెట్ ముక్కలు, అర కప్పు పచ్చి బఠాణీ, పావు టీస్పూన్ ఉప్పు వేసి కలపాలి. మూత పెట్టి, అప్పుడప్పుడు కలుపుతూ మగ్గనివ్వాలి.
4. తర్వాత, 2 టమాటో ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.
5. టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత, పావు కట్ట సన్నగా తరిగిన కొత్తిమీర, పావు కట్ట పుదీనా, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా వేసి కలపాలి. అందులో 2 గ్లాసుల కడిగిన బాస్మతి బియ్యం వేసి, 3 గ్లాసుల నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి, మీడియం మంటలో ఉడకనివ్వాలి.
6. బియ్యంలో నీరు ఇగిరే సమయంలో మూత పెట్టి, తక్కువ మంటపై 10 నిమిషాలు ఉడికించాలి. నీరు పూర్తిగా ఇగిరిపోయిన తర్వాత ఆలూ పులావ్ సిద్ధం. దీన్ని చట్నీ లేకుండానే తినవచ్చు. రైతాతో కలిపి తింటే మరింత రుచికరంగా ఉంటుంది.

