Rayalaseema Special Endu Mirchi Pappu:రాయలసీమ స్పెషల్ “ఎండుమిర్చి పప్పు” ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు
Rayalaseema Special Endu Mirchi Pappu:రాయలసీమ అంటే చాలామంది మనసులో మర్యాదలు, ఫ్యాక్షన్లు వంటివి గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు ఫ్యాక్షన్లు దాదాపు కనుమరుగయ్యాయని చెప్పవచ్చు. రాయలసీమ అంటే వంటకాలకు కూడా చాలా ప్రసిద్ధి.
ఇక్కడి వాళ్లకు మిగతా ప్రాంతాల వారి కంటే కొంచెం ఎక్కువ పౌరుషం ఉంటుందని అంటారు. దీనికి కారణం తాము తినే ఆహారమేనని సీమ ప్రజలు చెబుతుంటారు. రాయలసీమలో చాలామంది తరచూ తినే ఎండుమిర్చి పప్పు మీరు ఎప్పుడైనా రుచి చూశారా? ఒకవేళ రుచి చూడకపోతే, ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే!
అన్నం లేదా జొన్న రొట్టెతో రాయలసీమ స్టైల్లో తయారు చేసే ఎండుమిర్చి పప్పు తింటే స్వర్గం దిగివచ్చినట్టుంటుంది. ఇంట్లోనే రాయలసీమ స్పెషల్ ఎండుమిర్చి పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఎండుమిర్చి పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు
– నూనె
– కందిపప్పు
– చింతపండు
– ఉల్లిపాయ
– ఎండుమిర్చి
– ఆవాలు
– ధనియాలు
– వెల్లుల్లి
– శెనగపప్పు
– మినపప్పు
– జీలకర్ర
– పసుపు
– కరివేపాకు
– కొత్తిమీర
ఎండుమిర్చి పప్పు తయారీ విధానం
1. ముందుగా కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, అందులో అర కప్పు కందిపప్పు వేసి మంచి సుగంధం వచ్చే వరకు వేయించండి.
2. తర్వాత అందులో 1 ఉల్లిపాయ (తరిగినది), అర టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు, 10-12 కారమైన ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించండి.
3. ఉల్లిపాయలు, ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత, 2.5 కప్పుల నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.
4. కుక్కర్ మూత తీసి, పప్పును గుత్తితో మెత్తగా మాష్ చేయండి.
5. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేడి చేసి, అందులో పావు టీస్పూన్ మెంతులు వేసి ఎర్రగా వేయించండి.
6. మెంతులు వేగిన తర్వాత, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ నలిపిన ధనియాలు, 5 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ శెనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు, అర టీస్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసి తాళింపు ఎర్రగా వేగే వరకు వేయించండి.
7. తర్వాత మాష్ చేసిన పప్పును తాళింపు బాండీలో వేసి, రుచికి సరిపడా ఉప్పు కలిపి బాగా కలపండి.
8. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లి దించండి. అంతే, ఎండుమిర్చి పప్పు సిద్ధం! పప్పు గట్టిగా అనిపిస్తే, కొంచెం వేడి నీళ్లు కలిపి సర్దుబాటు చేయండి.

