Sabudana Makhana Kheer:తక్కువ సమయంలో టేస్టీగా “సుగ్గుబియ్యం మఖానా ఖీర్ రెసిపీ”.. టీ,కాఫీ బదులు..
Sabudana Makhana Kheer: టీ, కాఫీలు రోజూ ఒక్కసారైనా తాగకపోతే చాలామందికి రోజు గడవదు. అయితే, రోజూ తాగే టీ, కాఫీలకు బదులుగా ఒక కప్పు సగ్గుబియ్యం మఖానా ఖీర్‌ను ప్రయత్నించండి. ఇది మీ శరీరంలో అద్భుతమైన మార్పులను తెస్తుంది.
సగ్గుబియ్యం మఖానా ఖీర్ రుచికరమైన, పోషకాలతో నిండిన స్వీట్. ఇది తక్కువ సమయంలో సులభంగా తయారు చేయవచ్చు, ప్రత్యేకించి పండుగల సమయంలో లేదా అల్పాహారంగా ఎంతో రుచిగా ఉంటుంది.
సగ్గుబియ్యం, మఖానా రెండూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండటం వల్ల ఈ ఖీర్ ఆరోగ్యకరమైన ఎంపికగా నిలుస్తుంది. ఇది నీరసాన్ని తగ్గించి, శక్తిని అందిస్తుంది మరియు నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యానికి ఎన్నో లాభాలను అందించే సగ్గుబియ్యం మఖానా ఖీర్‌ను ఇంట్లో సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
సగ్గుబియ్యం మఖానా ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
– పాలు
– బెల్లం
– సగ్గుబియ్యం
– మఖానా
– బాదంపప్పు
– పిస్తాపప్పు
– నెయ్యి
– యాలకలు
– కుంకుమ పువ్వు
సగ్గుబియ్యం మఖానా ఖీర్ తయారీ విధానం
1. ముందుగా అర కప్పు సగ్గుబియ్యాన్ని కనీసం 2 గంటల పాటు నీటిలో నానబెట్టండి.
2. ఒక గిన్నెలో స్టవ్ మీద అర కప్పు తురిమిన బెల్లం వేసి, పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు వేడి చేయండి. బెల్లం కరిగిన తర్వాత 1 నిమిషం వేడి చేసి గిన్నెను పక్కన పెట్టండి.
3. స్టవ్ మీద పాన్‌లో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేసిన తర్వాత 1 కప్పు మఖానాను వేసి 3-4 నిమిషాలు కలుపుతూ బాగా వేయించండి. వేగిన మఖానాను ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టండి.
4. అదే పాన్‌లో 750 మి.లీ. (మూడున్నర కప్పులు) పాలు పోసి, పొంగే వరకు మరిగించండి.
5. పాలు మరగడం ప్రారంభమైన తర్వాత, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి, కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి బాగా కలుపుతూ ఉడికించండి.
6. ఇంతలో, మిక్సీలో 10 బాదంపప్పు, 1 టీస్పూన్ పిస్తాపప్పు, 4 యాలకలు వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేయండి.
7. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత, గ్రైండ్ చేసిన బాదం-పిస్తా పొడిని వేసి, 1-2 నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత సన్నగా తరిగిన 5 బాదంపప్పు ముక్కలు, వేయించిన మఖానాను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.
8. ఖీర్ కొద్దిగా చల్లారిన తర్వాత, ముందుగా తయారు చేసిన బెల్లం సిరప్‌ను వడకట్టి పోసి బాగా కలపండి.
అంతే! రుచికరమైన సగ్గుబియ్యం మఖానా ఖీర్ సిద్ధం.

