Pachi Mirchi Pachadi: కారంగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా “పచ్చిమిరపకాయ పచ్చడి” చేసుకొని చూడండి,
Pachi Mirchi Pachadi: కారంగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకొని చూడండి.. పచ్చిమిరపకాయలను సాధారణంగా కూరల్లో, పచ్చళ్లలో కారం కోసం ఉపయోగిస్తారు. అలాంటి పచ్చిమిర్చితో తయారు చేసే పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని కొంచెం నెయ్యితో కలిపి తింటే ఆ రుచిని మాటల్లో వర్ణించలేం.
ఈ పచ్చిమిరపకాయ పచ్చడి రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలతో తయారవుతుంది. ఒక్కో రాష్ట్రంలో ఈ పచ్చడిని విభిన్న పద్ధతుల్లో తయారు చేస్తారు. అయితే, ఆంధ్రా శైలిలో తయారైన పచ్చిమిరపకాయ పచ్చడి రుచికరంగానూ, ఆరోగ్యప్రయోజనాలతోనూ నిండి ఉంటుంది. ఇంట్లోనే ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.
పచ్చిమిర్చి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు:
నూనె
పచ్చిమిరపకాయలు
చింతపండు
పచ్చి శనగపప్పు
టమాటోలు
పసుపు
ఎండుమిర్చి
జీలకర్ర
ఆవాలు
మినపప్పు
మెంతులు
వెల్లుల్లి
కరివేపాకు
కొత్తిమీర
పచ్చిమిర్చి పచ్చడి తయారీ విధానం:
స్టవ్ మీద పాన్ పెట్టి, 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, చిటికెడు మెంతులు వేసి వేయించండి.
తర్వాత 75 గ్రాముల కారంగా ఉండే బజ్జీ మిరపకాయలను ముక్కలుగా కట్ చేసి పాన్లో వేసి బాగా మగ్గనివ్వండి.
మిరపకాయలు మగ్గిన తర్వాత, 3 టమాటోలను పెద్ద ముక్కలుగా కట్ చేసి, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి, టమాటోలు మెత్తబడే వరకు వేగనివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
వేయించిన పదార్థాలను మిక్సీ గిన్నెలో వేసి, నానబెట్టిన చింతపండును కూడా జోడించి, బరకగా గ్రైండ్ చేయండి.
తాళింపు కోసం, పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. అందులో 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 7-8 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించండి.
తాళింపు వేగిన తర్వాత, గ్రైండ్ చేసిన పచ్చడిని పాన్లో వేసి బాగా కలపండి.
చివరగా, స్టవ్ ఆఫ్ చేసే ముందు పచ్చడిలో కొంచెం ఎక్కువగా కొత్తిమీర తరుగు వేసి కలపండి.
అంతే! రుచికరమైన, ఆరోగ్యకరమైన పచ్చిమిర్చి పచ్చడి సిద్ధం!

