Tirumala Prasadam Pulihora:పులిహోర అంటే ఇష్టమా .. గుడిలో ప్రసాదం స్టైల్‌లో తయారు చేసుకోండి ..
Tirumala Prasadam Pulihora:తిరుమల పేరు వినగానే వెంకటేశ్వర స్వామి గుర్తుకు రావడమే కాక, అక్కడి ప్రసాదాలు కూడా కళ్లముందు కనిపిస్తాయి. తిరుపతి లడ్డు ఎంత ప్రసిద్ధమో, అక్కడి పులిహోర కూడా అంతే ప్రసిద్ధి. నోట్లో పెట్టుకుంటే అమృతం లాంటి రుచిని ఇస్తుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆగమ శాస్త్ర నియమాలను పాటిస్తూ ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అయితే, ఈ పులిహోరను ఇంట్లోనూ అదే రుచితో తయారు చేసుకోవచ్చు. అసలైన తిరుమల ప్రసాదం పులిహోరను ఇంట్లో ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల ప్రసాదం పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు
నువ్వుల నూనె
నెయ్యి
జీడిపప్పు
చింతపండు
వండిన అన్నం
మెంతులు
మిరియాలు
జీలకర్ర
ఆవాలు
ఇంగువ
పచ్చి శెనగపప్పు
మినపప్పు
కరివేపాకు
పసుపు
రాళ్ల ఉప్పు
తిరుమల ప్రసాదం పులిహోర తయారీ విధానం
ముందుగా 425 గ్రాముల బియ్యాన్ని శుభ్రంగా కడిగి, 4.5 కప్పుల నీటిని పోసి అన్నం వండండి. అన్నం పొడిగా, గింజలు విడివిడిగా ఉండేలా చూసుకోండి.
వండిన అన్నాన్ని ఒక ప్లేట్‌లో వేసి, అందులో 30 గ్రాముల నువ్వుల నూనె పోసి సమంగా కలపండి. దీన్ని చల్లారేలా పక్కన పెట్టండి.
65 గ్రాముల చింతపండు నుండి నార, గింజలు తీసివేసి, 400 ml వేడి నీటిలో పావుగంట సేపు నానబెట్టండి.
ఒక గిన్నెలో 2 టీస్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల మిరియాలు వేసి నూనె లేకుండా వేయించండి. మెంతులు రంగు మారి చిట్లుతున్నప్పుడు 2 టీస్పూన్ల జీలకర్ర వేసి, సన్నని మంట మీద వేగనివ్వండి. ఆ తర్వాత వీటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయండి లేదా రోట్లో దంచండి.
ఒక గిన్నెలో 150 ml నువ్వుల నూనె వేసి వేడి చేయండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి పొంగనివ్వండి. తర్వాత 2 టీస్పూన్ల పచ్చి శెనగపప్పు, 2 టీస్పూన్ల మినపప్పు వేసి మీడియం మంట మీద ఎర్రగా వేయించండి. పప్పులు రంగు మారుతున్నప్పుడు అర టీస్పూన్ ఇంగువ, నాలుగు రెబ్బల కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి వేగనివ్వండి.
వేగిన తాళింపులో నానిన చింతపండు గుజ్జును పిండి వేయండి. గ్రైండ్ చేసిన మిరియాలు-మెంతుల పొడి, 2 టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు కూడా వేసి, మీడియం మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాలు మరగనివ్వండి. తర్వాత స్టవ్ ఆపి గిన్నెను పక్కన పెట్టండి.
మరో పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసి, 30 గ్రాముల జీడిపప్పు వేసి ఎర్రగా వేయించి స్టవ్ ఆపేయండి.
చల్లారిన నువ్వుల నూనె కలిపిన అన్నంలో తయారు చేసిన పులిహోర గుజ్జును వేసి, మొత్తం సమంగా కలిసేలా నెమ్మదిగా కలపండి. అందులో వేయించిన జీడిపప్పును నెయ్యితో సహా వేసి కలపండి.
ఈ మిశ్రమాన్ని కనీసం 2 గంటలపాటు పక్కన ఉంచండి. తర్వాత సర్వ్ చేస్తే, నోట్లో పెట్టుకున్నప్పుడు అమృతం లాంటి రుచి వస్తుంది.

