Kitchenvantalu

Mushroom Donne Biryani:ఘుమఘమలాడే కర్నాటక స్పెషల్ “మష్రూమ్ దొన్నె బిర్యానీ”.. తింటే అసలు వదలరు

Mushroom Donne Biryani:ఘుమఘమలాడే కర్నాటక స్పెషల్ “మష్రూమ్ దొన్నె బిర్యానీ”.. తింటే అసలు వదలరు.. దొన్నె బిర్యానీ… ఈ పేరు వినగానే మాంసాహార ప్రియులకు నోరూరే రుచి గుర్తొస్తుంది. అయితే, అదే రుచి, సుగంధంతో కూడిన శాకాహార దొన్నె బిర్యానీని కూడా తయారు చేయవచ్చు.

కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతంలో ఉద్భవించిన ఈ బిర్యానీ, దొన్నెల (ఎండిన ఆకులతో తయారైన గిన్నెలు)లో వడ్డించడం వల్ల ఈ పేరు సంపాదించింది. ప్రత్యేక మసాలాలు, పుదీనా, కొత్తిమీర కలయికతో పచ్చటి రంగులో ఉండే ఈ బిర్యానీ, రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

సాధారణ బిర్యానీలు విసుగు తెప్పిస్తే, ఒకసారి చిట్టిముత్యాలతో తయారయ్యే మష్రూమ్ దొన్నె బిర్యానీని ప్రయత్నించండి. దీని రుచి పూర్తిగా వేరే స్థాయిలో ఉంటుంది. కర్ణాటక స్పెషల్ శాకాహార మష్రూమ్ దొన్నె బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
చిట్టి ముత్యాల బియ్యం
పుట్టగొడుగులు (మష్రూమ్స్)
నెయ్యి
నూనె
లవంగాలు
బిర్యానీ ఆకు
మిరియాలు
యాలకులు
రాతిపువ్వు
జాపత్రి
పుదీనా
కొత్తిమీర
పచ్చిమిర్చి
దాల్చిన చెక్క
షాజీరా
స్టార్ అనాస
ఉల్లిపాయలు
అల్లం-వెల్లుల్లి పేస్ట్
ఉప్పు
కారం
పసుపు

తయారీ విధానం
స్టవ్ మీద ఒక పాన్‌లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. అందులో అర టీస్పూన్ మిరియాలు, 5 లవంగాలు, 5 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి 10 సెకన్లు వేయించి, 1 కప్పు ఉల్లిపాయ చీలికలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. తర్వాత స్టవ్ ఆపేయండి.వేయించిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేయండి.

ఇప్పుడు అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి, 5 పచ్చిమిర్చి ముక్కలు, పిడికెడు పుదీనా ఆకులు, ఒక పెద్ద కప్పు కొత్తిమీర (కాడలతో సహా) తరిగి, పిడికెడు మెంతికూర ఆకులు వేసి, ఆకుల నుండి పచ్చి వాసన పోయే వరకు 5 నిమిషాలు వేయించండి.

వేయించిన ఈ ఆకుల మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి, కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేయండి. తిరిగి పాన్‌లో 4 టేబుల్ స్పూన్ల నూనె, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. అందులో 5 లవంగాలు, 1 టీస్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, అర టీస్పూన్ మిరియాలు, 5 యాలకులు, కొద్దిగా రాతిపువ్వు, చిన్న జాపత్రి, 1 స్టార్ అనాస వేసి మసాలా దినుసులను పొంగించండి.

ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేయించండి.తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి.ఆ తర్వాత 200 గ్రాముల మష్రూమ్స్ (మధ్యలో చీరినవి), రుచికి తగినంత ఉప్పు, 1 టీస్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు వేసి, మష్రూమ్స్‌లోని నీరు ఆరిపోయే వరకు వేయించండి.

మష్రూమ్స్ నుండి నీరు విడుదలవుతున్నప్పుడు, అర కప్పు పెరుగు వేసి బాగా కలపండి.మష్రూమ్స్ నుండి నూనె పైకి తేలిన తర్వాత, మొదట గ్రైండ్ చేసిన ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసి, 3 నిమిషాలు వేయించండి.ఆ తర్వాత, గంటసేపు నానబెట్టిన 2 కప్పుల చిట్టి ముత్యాల బియ్యం వేసి, బియ్యంలోని తడి ఆరే వరకు నెమ్మదిగా కలుపుతూ వేయించండి.

అనంతరం గ్రైండ్ చేసిన ఆకుల పేస్ట్ వేసి, బియ్యంతో 3-4 నిమిషాలు వేయించండి.తర్వాత, 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ల చొప్పున, మొత్తం 4 కప్పుల వేడి నీళ్లు పోసి, కలిపి మూత పెట్టి, పెద్ద మంట మీద 7-8 నిమిషాలు ఉడికించండి.

బియ్యం దాదాపు ఉడికిన సమయంలో, మూత తీసి కలిపి, మళ్లీ మూత పెట్టి, తక్కువ మంట మీద 10 నిమిషాలు ఉడికించండి.స్టవ్ ఆపేసి, మూత తీయకుండా పావు గంట వదిలేయండి. తర్వాత మూత తెరిస్తే, ఇంటిలో ఘుమఘుమలాడే సుగంధం వస్తుంది. ఈ శాకాహార మష్రూమ్ దొన్నె బిర్యానీ తింటే స్వర్గమే సొంతం అనిపిస్తుంది!