Okra Rice : కూరలు చేసే సమయం లేనప్పుడు ఇలా ఈజీగా “బెండకాయ రైస్” చేసుకోండి …
Okra Rice:బెండకాయలను చాలా మంది వేపుడు లేదా కూర రూపంలో తింటారు. కొందరు వీటిని టమాటాలతో కలిపి వండుతారు. అయితే, ఈ రకాలు నచ్చని వారు బెండకాయలతో రైస్ తయారు చేసి తినవచ్చు. ఇది రుచికరంగానూ, ఆరోగ్యకరంగానూ ఉంటుంది. బెండకాయల్లో విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టి, వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవాలి. ఇప్పుడు బెండకాయ రైస్ తయారీ విధానాన్ని తెలుసుకుందాం.
బెండకాయ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు:
బెండకాయ ముక్కలు – 250 గ్రాములు
ఎండు కొబ్బరి – 1/4 కప్పు
పుట్నాల పప్పు – 1/2 కప్పు
కారం – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
పల్లీలు – 1/4 కప్పు
వెల్లుల్లి రెబ్బలు – 6
ఆవాలు – 1 టీస్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
శనగ పప్పు – 1 టీస్పూన్
మినప పప్పు – 1 టీస్పూన్
ఎండు మిర్చి – 3
పచ్చి మిర్చి – 4
కరివేపాకు – 2 రెమ్మలు
నూనె – 4 టేబుల్ స్పూన్లు
అన్నం – 250 గ్రాముల బియ్యం ఉడికించినది
తయారీ విధానం:
మిక్సీలో ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పొడి చేయాలి.స్టవ్ మీద బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసి, మూత పెట్టి వేయించాలి.రెండు నిమిషాల తర్వాత మూత తీసి, చిటికెడు ఉప్పు చల్లి, ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేగనివ్వాలి. వీటిని ఒక ప్లేటులోకి తీసి పెట్టుకోవాలి.
అదే బాణలిలో పల్లీలు వేసి వేగించి, ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగ పప్పు, మినప పప్పు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి వేయించాలి.ఉడికించిన అన్నం జత చేసి, తయారు చేసిన పొడిని వేసి బాగా కలపాలి.వేయించిన బెండకాయ ముక్కలను జత చేసి, అన్నీ సమానంగా కలిసేలా కలపాలి.
మూడు నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలి.ఇలా రుచికరమైన బెండకాయ రైస్ సిద్ధమవుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు. బెండకాయ కూరలు ఇష్టం లేని వారికి ఇది గొప్ప ఎంపిక. ఈ విధంగా బెండకాయల్లోని పోషకాలను పొందవచ్చు, అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

