Kitchenvantalu

Cabbage Fry:ఒంటికి ఇమ్మ్యూనిటీని పెంచే “క్యాబేజి వేపుడు” వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని తినండి

Cabbage Fry:ఒంటికి ఇమ్మ్యూనిటీని పెంచే “క్యాబేజి వేపుడు” వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని తినండి.. చాలా మంది క్యాబేజిని తినడానికి ఇష్టపడరు, కానీ ఇది అనేక పోషకాలతో నిండిన ఆహారం.

ఇందులో మాంగనీస్, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ బి6 వంటి విటమిన్లు ఉంటాయి. క్యాబేజిని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. అంతేకాకుండా, క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

క్యాబేజి మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ కె రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా, గాయాల వల్ల రక్తస్రావం అధికంగా కాకుండా నియంత్రిస్తుంది. అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా క్యాబేజి ఉపయోగపడుతుంది. కాబట్టి, క్యాబేజిని ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

క్యాబేజిని ఇష్టపడని వారు దీన్ని రుచికరమైన వేపుడుగా తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా చేస్తే క్యాబేజి వేపుడు రుచిగా ఉండడమే కాకుండా, దానిలోని పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. క్యాబేజి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు, విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాబేజి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు:
క్యాబేజి – 250 గ్రాములు
పెసరపప్పు – 3 టేబుల్ స్పూన్లు
పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి – 2
వెల్లుల్లి రెబ్బలు – 4 లేదా 5 (మెత్తగా రుబ్బినవి)
జీలకర్ర – అర టీ స్పూన్
ఆవాలు – అర టీ స్పూన్
నూనె – 2 టీ స్పూన్లు
కరివేపాకు – 1 రెమ్మ
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – పావు టీ స్పూన్
కారం – రుచికి సరిపడా
ధనియాల పొడి – 1 టీ స్పూన్
తరిగిన కొత్తిమీర – కొద్దిగా

క్యాబేజి వేపుడు తయారీ విధానం:
క్యాబేజిని చిన్న ముక్కలుగా తరిగి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.పెసరపప్పును కడిగి, అరగంట నీటిలో నానబెట్టాలి.ఒక కళాయిలో నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగించాలి.

ఇవి వేగిన తర్వాత తరిగిన క్యాబేజి, నానబెట్టిన పెసరపప్పును వేసి బాగా కలపాలి.మూత పెట్టి, మధ్యస్థ మంటపై క్యాబేజిని ఉడికించాలి.పెసరపప్పు ఉడకనట్టు అనిపిస్తే, కొద్దిగా నీరు చల్లి ఉడికించాలి.క్యాబేజి, పెసరపప్పు పూర్తిగా ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి.5 నిమిషాలు మూత పెట్టి మళ్లీ ఉడికించి, చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఈ విధంగా తయారు చేసిన క్యాబేజి వేపుడు రుచికరంగా ఉండడమే కాకుండా, దానిలోని పోషకాలు ఎక్కువగా నష్టపోకుండా శరీరానికి అందుతాయి. దీన్ని చపాతీ లేదా అన్నంతో తినవచ్చు.