Kitchenvantalu

Kobbari Pachadi:”కొబ్బరి పచ్చడి” ఇలా చేస్తే అన్నంలోకి టిఫిన్స్ లోకి సూపర్ గా ఉంటుంది

Kobbari Pachadi:కొబ్బరిని పచ్చిగా లేదా ఎండుగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. దీనితో రకరకాల తీపి లేదా కారం వంటకాలను తయారు చేసుకోవచ్చు. అలాంటి వంటకాల్లో కొబ్బరి పచ్చడి ఒకటి. కొబ్బరితో చేసే తీపి వంటకాలు చాలా మందికి ఇష్టమైనప్పటికీ, కారం వంటకాలు కొంతమందికి నచ్చకపోవచ్చు.

కొబ్బరి పచ్చడిని తినడానికి కొందరు ఆసక్తి చూపకపోయినా, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉదయం ఇడ్లీ, దోసెలతో కొబ్బరి చట్నీ తింటే శరీరానికి ఎంతో ఉపయోగం. రుచిగా ఉండే కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు:
కొబ్బరి ముక్కలు – 1 కప్పు
టమాటాలు – 2 (ముక్కలుగా కోసుకోవాలి)
చింతపండు – 10 గ్రాములు
ఎండుమిర్చి – 15
వెల్లుల్లి రెబ్బలు – 6 లేదా 7
నీళ్లు – కొద్దిగా
నూనె – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా

తాళింపు కోసం కావలసిన పదార్థాలు:
జీలకర్ర – అర టీ స్పూన్
ఆవాలు – అర టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 1 రెమ్మ
ఇంగువ – చిటికెడు
నూనె – 2 టేబుల్ స్పూన్లు

కొబ్బరి పచ్చడి తయారీ విధానం:
ముందుగా కళాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత ఎండుమిర్చిని వేసి వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.అదే కళాయిలో కొబ్బరి ముక్కలను వేసి 4 నిమిషాలు వేయించి, వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి.మళ్లీ అదే కళాయిలో టమాటా ముక్కలు, చింతపండు వేసి మెత్తగా ఉడికే వరకు వండుకోవాలి.

ఒక మిక్సీ జార్‌లో వేయించిన ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.ఆ తర్వాత అందులో వేయించిన కొబ్బరి ముక్కలను వేసి మళ్లీ రుబ్బుకోవాలి.ఇప్పుడు ఉడికించిన టమాటా ముక్కలు, చింతపండు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.తాళింపు కోసం కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి.తాళింపు వేగిన తర్వాత రుబ్బుకున్న పచ్చడిని వేసి బాగా కలిపి, 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయాలి.

ఇలా తయారు చేసిన కొబ్బరి పచ్చడి వేడి వేడి అన్నం, దోసె, ఇడ్లీ, పెసరట్టుతో తింటే రుచిగా ఉండడమే కాక, కొబ్బరిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.