Kitchenvantalu

Pachi Pulusu:ఇంట్లో కూరలు లేనపుడు అప్పటికప్పుడు అన్నంలోకి చేసుకొనే “పచ్చి పులుసు”..

Pachi Pulusu:ఇంట్లో కూరలు లేనపుడు అప్పటికప్పుడు అన్నంలోకి చేసుకొనే “పచ్చి పులుసు”.. మన పూర్వీకులు ఎక్కువగా తినే ఆహారంలో చింతపండు గుజ్జుతో తయారయ్యే పచ్చి పులుసు ఒకటి. ఈ పచ్చి పులుసు చాలా రుచికరంగా ఉంటుంది. అయితే, ప్రస్తుత కాలంలో దీన్ని తయారు చేసే వారు చాలా తక్కువ.

ఈ పులుసును తయారు చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. పచ్చి పులుసుతో అన్నం తినడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, మరియు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు పచ్చి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు మరియు తయారీ విధానాన్ని తెలుసుకుందాం.

పచ్చి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు:
ఎండు మిరపకాయలు – 15
చింతపండు – 20 గ్రాములు
తరిగిన ఉల్లిపాయలు – 2
ఉప్పు – రుచికి సరిపడా
కరివేపాకు – 2 రెబ్బలు
వెల్లుల్లి గడ్డ – 1 (చిన్నది)
నీళ్లు – సరిపడా

పచ్చి పులుసు తయారీ విధానం:
ముందుగా ఎండు మిరపకాయలను పెనంపై వేసి కాల్చాలి.ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు, కాల్చిన ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి, చేతితో బాగా నలిపి కచ్చాపచ్చాగా చేయాలి.ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు కదలకుండా పక్కన పెట్టాలి.

తర్వాత, ఈ పులుసులో దంచిన వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్లీ చేతితో బాగా నలపాలి.అనంతరం, ఎండు మిరపకాయ గింజలను తొలగించాలి.ఇలా తయారైన పచ్చి పులుసు చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని చల్లారిన అన్నం లేదా రాగి సంగటితో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది.

జలుబు, దగ్గు ఉన్నప్పుడు లేదా నోటికి రుచి కావాలనిపించినప్పుడు ఈ పచ్చి పులుసును తయారు చేసుకోవచ్చు. పచ్చి పులుసును తయారు చేసిన తర్వాత పోపు వేయవచ్చు లేదా కొద్దిగా వేడి చేసి తినవచ్చు. ఎలా తిన్నా, ఈ పచ్చి పులుసు రుచిగానే ఉంటుంది.