Kitchenvantalu

Tomato Rice:ఉదయం పూట తక్కువ టైంలో చేసుకునే “టమాటో రైస్”..

Tomato Rice:ఉదయం పూట తక్కువ టైంలో చేసుకునే “టమాటో రైస్”.. టమాటాలు మన వంటింట్లో తరచూ ఉపయోగించే కూరగాయల్లో ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, రక్తపోటును తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి.

టమాటాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి, ఎముకలు దృఢంగా మారతాయి, మరియు చర్మ సంరక్షణలో కూడా ఇవి ఉపయోగపడతాయి. టమాటాలను రోజూ తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.

టమాటాలతో తయారు చేసే వంటకాల్లో టమాటా రైస్ ఒక రుచికరమైన, సులభమైన వంటకం. ఈ రైస్‌ను తక్కువ సమయంలో సులభంగా తయారు చేయవచ్చు. టమాటా రైస్ తయారీకి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటా రైస్ తయారీకి కావలసిన పదార్థాలు:
ఉడికించి చల్లార్చిన అన్నం – 1½ కప్పు
నూనె – 3 టేబుల్ స్పూన్లు
లవంగాలు – 4
యాలకులు – 3
బిర్యానీ ఆకు – 1
దాల్చిన చెక్క – 2 (చిన్నవి)
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1
పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి – 3 లేదా 4
కరివేపాకు – 1 రెబ్బ
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – ¼ టీ స్పూన్
తరిగిన టమాటాలు – 3 (మధ్యస్థ పరిమాణం)
కారం – రుచికి సరిపడా
ధనియాల పొడి – ½ టీ స్పూన్
జీలకర్ర పొడి – ¼ టీ స్పూన్
గరం మసాలా – ¼ టీ స్పూన్
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
జీడిపప్పు పలుకులు – 10

టమాటా రైస్ తయారీ విధానం:
ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేయించండి.తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేగనివ్వండి.ఆ తరువాత జీడిపప్పు పలుకులు వేసి వేయించండి.

జీడిపప్పు వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి బాగా వేయించండి.ఉల్లిపాయలు వేగిన తరువాత తరిగిన టమాటా ముక్కలు వేసి, కలిపి మూత పెట్టి మధ్యస్థ మంటపై ఉడికించండి.టమాటా ముక్కలు సగం ఉడికిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి.

మళ్లీ మూత పెట్టి టమాటాలు పూర్తిగా ఉడికే వరకు మధ్యస్థ మంటపై ఉంచండి.టమాటాలు ఉడికిన తరువాత చల్లార్చిన అన్నాన్ని వేసి జాగ్రత్తగా కలపండి.అన్నం కలిపిన తరువాత చిన్న మంటపై మూత పెట్టి 5 నిమిషాలు ఉంచండి.చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి.

ఇలా చేయడం వల్ల రుచికరమైన టమాటా రైస్ సిద్ధమవుతుంది. టమాటా ముక్కలతో పాటు, పచ్చి టమాటాలను మిక్సీలో వేసి గుజ్జుగా చేసి కూడా ఈ వంటకంలో ఉపయోగించవచ్చు. టమాటా రైస్ అందరికీ ఇష్టమైన వంటకం. ఉదయం కూర చేయడానికి సమయం లేని వారు లేదా మధ్యాహ్నం లంచ్ బాక్స్ కోసం ఈ టమాటా రైస్‌ను త్వరగా తయారు చేసి ఆస్వాదించవచ్చు.