Meal Maker Masala Curry:మటన్ కన్నా సూపర్ టేస్టీగా ఉండే “మీల్ మేకర్ మసాలా” కర్రీ..
Meal Maker Masala Curry:మటన్ కన్నా సూపర్ టేస్టీగా ఉండే “మీల్ మేకర్ మసాలా” కర్రీ.. సోయా గింజల నుండి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థంతో తయారు చేసినవే మీల్ మేకర్స్ (సోయా చంక్స్). ఈ మీల్ మేకర్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడతాయి.
మహిళల్లో హార్మోన్ అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంతో పాటు, మెనోపాజ్ దశలో సమస్యలను తగ్గిస్తాయి. వీటిలో యాంటీ-ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
మీల్ మేకర్స్‌లో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి, మాంసం తినని వారికి ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్స్‌ను అందిస్తాయి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేయవచ్చు. అందులో భాగంగా, మీల్ మేకర్ మసాలా కర్రీ తయారీ విధానం మరియు దానికి కావాల్సిన పదార్థాల గురించి తెలుసుకుందాం.
మీల్ మేకర్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు:
మీల్ మేకర్స్ (సోయా చంక్స్) – 1 కప్పు
తరిగిన ఉల్లిపాయ – 1
తరిగిన పచ్చిమిర్చి – 2
తరిగిన టమాటా – 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
లవంగాలు – 5
దాల్చిన చెక్క ముక్కలు – 2 (చిన్నవి)
సాజీరా – 1 టీ స్పూన్
యాలకులు – 3 లేదా 4
జీడిపప్పు – 10
నువ్వులు – 1 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
పచ్చి కొబ్బరి ముక్కలు – ¼ కప్పు
గరం మసాలా – 1 టేబుల్ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
కారం – 1 టేబుల్ స్పూన్
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
కరివేపాకు – 1 రెబ్బ
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
నీళ్లు – ½ లీటర్
మీల్ మేకర్ మసాలా కర్రీ తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో ½ లీటర్ నీటిని వేడి చేసి, అందులో మీల్ మేకర్స్‌ను వేసి 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీటిని పిండి, మీల్ మేకర్స్‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసి, నానబెట్టిన మీల్ మేకర్స్‌ను ఎర్రగా వేయించి, ఒక గిన్నెలోకి లేదా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఒక జార్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, నువ్వులు, ధనియాలను వేసి మెత్తని పేస్ట్‌గా చేయాలి.కళాయిలో నూనె వేసి కాగిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తర్వాత టమాటా ముక్కలను వేసి, మూత పెట్టి మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి.టమాటాలు ఉడికిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ముందుగా తయారు చేసిన పేస్ట్‌ను వేసి బాగా కలపాలి. నూనె పైకి తేలే వరకు ఈ మిశ్రమాన్ని ఉడికించాలి.ఆ తర్వాత వేయించి పెట్టుకున్న మీల్ మేకర్స్‌ను, 1 గ్లాసు నీటిని జోడించి, మూత పెట్టి మధ్యస్థ మంటపై 10 నిమిషాలు ఉడికించాలి.
చివరగా, కొత్తిమీరను వేసి కలిపి మరో 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.ఇలా తయారైన మీల్ మేకర్ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని పులావ్ లేదా చపాతీలతో కలిపి తింటే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు.

