Sorakaya Pachadi:వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే “సొరకాయ పచ్చడి”.. తింటే అసలు వదలరు..
Sorakaya Pachadi:వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే “సొరకాయ పచ్చడి”.. తింటే అసలు వదలరు.. సొరకాయ మన వంటింట్లో తరచూ ఉపయోగించే కూరగాయల్లో ఒకటి. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
సొరకాయ బరువు తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది, అధిక రక్తపోటు మరియు షుగర్‌ను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, కాలేయం మరియు మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది. అంతేకాక, సొరకాయను తరచూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు ఎముకలు దృఢంగా తయారవుతాయి.
సొరకాయతో రకరకాల వంటకాలు, ఆహార పదార్థాలను తయారు చేస్తాం. వీటిలో సొరకాయ పచ్చడి ఒక రుచికరమైన ఎంపిక. ఈ పచ్చడి పుల్లగా, రుచిగా ఉంటుంది. సొరకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలి, దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు:
లేత సొరకాయ – 1 (మధ్యస్థ పరిమాణం)
చింతపండు – 15 గ్రాములు
పచ్చిమిరపకాయలు – 12
వెల్లుల్లిపాయ – 1
తరిగిన ఉల్లిపాయ – 1
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
కరివేపాకు – 1 రెబ్బ
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1/2 టీ స్పూన్
మెంతులు – 1/4 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – 1/4 టీ స్పూన్
తాళింపు కోసం కావలసిన పదార్థాలు:
నూనె – 1 టీ స్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 1 రెబ్బ
శనగపప్పు – 1 టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
సొరకాయ పచ్చడి తయారీ విధానం:
సొరకాయను శుభ్రంగా కడిగి, పొట్టు తీయకుండా ముక్కలుగా కోయాలి.చింతపండును కడిగి, తగినంత నీళ్లలో నానబెట్టాలి.ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కాగాక, పచ్చిమిరపకాయలను ముక్కలుగా కోసి వేయాలి. అందులో పొట్టు తీసిన వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసి, మధ్యస్థ మంటపై పచ్చిమిరపకాయలు సగం వేగే వరకు వేయించాలి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారే వరకు పక్కన పెట్టాలి.
అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి, సొరకాయ ముక్కలను వేసి పూర్తిగా ఉడికే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.ఒక మిక్సీ జార్‌లో వేయించిన పచ్చిమిరపకాయలు, నానబెట్టిన చింతపండు, తరిగిన కొత్తిమీర వేసి కచ్చాపచ్చాగా మెత్తగా గ్రైండ్ చేయాలి.
తర్వాత ఉడికించిన సొరకాయ ముక్కలను, చింతపండు నానిన నీళ్లలో కొద్దిగా వేసి, మరీ మెత్తగా కాకుండా మిక్సీలో గ్రైండ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఒక చిన్న కళాయిలో నూనె వేసి కాగాక, తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేయాలి. ఈ తాళింపును సొరకాయ పచ్చడిలో వేసి కలపాలి.
ఇలా తయారైన సొరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. తాళింపు లేకుండా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని అన్నం, చపాతీ, పుల్కా, దోసె, ఉతప్పం వంటి వాటితో తినవచ్చు. సొరకాయ పచ్చడి రుచికరంగా ఉండడమే కాక, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

