Black Powder on Onions:నల్ల మచ్చలున్న ఉల్లిపాయలు తినొచ్చా, చాలా మంది చేస్తున్న తప్పు ఇదే.. తెలుసుకోండి..
Black Powder on Onions:నల్ల మచ్చలున్న ఉల్లిపాయలు తినొచ్చా, చాలా మంది చేస్తున్న తప్పు ఇదే.. తెలుసుకోండి.. ఉల్లిపాయలు తల్లి చేసే మేలును కూడా అందించగలవని మన పెద్దలు చెబుతుంటారు.
ఎందుకంటే, ఉల్లిపాయలు వంటకు రుచిని జోడించడమే కాకుండా, అనేక పోషకాలతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు అంటున్నారు. అయితే, కొన్నిసార్లు ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు కనిపిస్తాయి. అలాంటి ఉల్లిపాయలను తినవచ్చా, లేకపోతే నిపుణులు ఏమి సూచిస్తున్నారో తెలుసుకుందాం.
నిపుణుల ప్రకారం, ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు ఆస్పెర్‌గిల్లస్ నైజర్ అనే శిలీంధ్రం వల్ల ఏర్పడతాయి. ఈ శిలీంధ్రం నేలలో సహజంగా కనిపిస్తుంది. ఉల్లిపాయలను సంచుల్లో లేదా గాలి తిరగని మూసి ఉన్న కంటైనర్‌లలో, ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణంలో నిల్వ చేస్తే, ఈ శిలీంధ్రం వృద్ధి చెందుతుంది.
ఈ శిలీంధ్రం ఉల్లిపాయ బయటి పొరపై పెరగడం ప్రారంభమై, నల్లటి పొడి రూపంలో అవశేషాలను వదిలిస్తుంది. ఉల్లిపాయ బయటి చర్మం దెబ్బతిన్నప్పుడు ఈ మచ్చలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ శిలీంధ్రం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నల్ల మచ్చల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం లేదు. అటువంటి ఉల్లిపాయలను శుభ్రం చేసి, శిలీంధ్ర పొరను తొలగించడం ద్వారా వాడుకోవచ్చు. నల్ల మచ్చలున్న ఉల్లిపాయలను వండే ముందు తొక్క తీసి, బాగా కడిగితే ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే, ఈ శిలీంధ్రం కొన్ని సందర్భాల్లో విష పదార్థాలను విడుదల చేసే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల, అలెర్జీలు, ఉబ్బసం, లేదా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఉల్లిపాయలను తినకుండా ఉండటం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
అలాగే, ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం సరైన పద్ధతి కాదని, అలా చేస్తే నల్లటి శిలీంధ్రం లేని ఉల్లిపాయలను మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

