Kitchenvantalu

Methi Puri:ఎప్పుడుతినే పూరి కాకుండా ఇలా “మేతి పూరి”ని చేసుకోండి.. చాలా రుచిగా ఉంటుంది..

Methi Puri:ఎప్పుడుతినే పూరి కాకుండా ఇలా “మేతి పూరి”ని చేసుకోండి.. చాలా రుచిగా ఉంటుంది.. మెంతి ఆకులతో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి, అలాగే మెంతులతో కలిగే లాభాలు కూడా ఈ ఆకుల ద్వారా పొందవచ్చు. అయితే, చాలా మంది మెంతి ఆకులను నేరుగా తినడానికి ఆసక్తి చూపరు. కానీ ఈ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

నేరుగా తినలేని వారు వీటిని వివిధ విధానాల్లో ఉపయోగించి తినవచ్చు. ముఖ్యంగా, మెంతి ఆకులతో తయారు చేసే పూరీలు చాలా మందికి ఇష్టమైనవి. ఈ పూరీలను రుచికరంగా తయారు చేసి ఆస్వాదించవచ్చు. ఇప్పుడు మెంతి ఆకులతో పూరీలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

మెంతి ఆకుల పూరీ తయారీకి కావలసిన పదార్థాలు:
మెంతి ఆకులు – 1 కప్పు
గోధుమ పిండి – 1 కప్పు
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
పసుపు – చిటికెడు
కారం – రుచికి సరిపడా
వెల్లుల్లి తురుము – 1 టీస్పూన్
పెరుగు – 2 పెద్ద టీస్పూన్లు
ఉప్పు – తగినంత
పచ్చిమిర్చి – 4 (సన్నగా తరిగినవి)
అల్లం తురుము – 1 పెద్ద టీస్పూన్
నెయ్యి – తగినంత
కసూరీ మేథీ – కొద్దిగా
ధనియాల పొడి – 1 టీస్పూన్
గరం మసాలా – 1 పెద్ద టీస్పూన్

మెంతి ఆకుల పూరీ తయారీ విధానం:
ఒక గిన్నెలో గోధుమ పిండి, మెంతి ఆకులు, పసుపు, కారం, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి, అల్లం తురుము, కసూరీ మేథీ, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, నెయ్యి, పెరుగు వేసి బాగా కలపాలి.

అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి చపాతీ పిండిలాగా మెత్తగా కలపాలి.ఈ పిండిని 5 నిమిషాల పాటు పక్కన ఉంచి, ఆ తర్వాత చిన్న ఉండలుగా చేసి పూరీల్లా వత్తాలి.
స్టవ్ మీద కళాయిలో నూనె పోసి, అది బాగా కాగిన తర్వాత పూరీలను వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.రుచికరమైన మెంతి ఆకుల పూరీలు సిద్ధం! వీటిని పప్పు లేదా ఆలూ టమాటా కూరతో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటాయి.