Palak Sweet Corn Curry:రోటీ లోకి పాలకూర కార్న్ కలిపి “కూర” చేస్తే సూపర్..
Palak Sweet Corn Curry:రోటీ లోకి పాలకూర కార్న్ కలిపి “కూర” చేస్తే సూపర్.. పాలకూర, స్వీట్‌కార్న్‌లతో తయారయ్యే కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరలో విటమిన్ ఎ, సి, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, అలాగే స్వీట్‌కార్న్‌లో బి కాంప్లెక్స్ విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.

ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రెండింటినీ కలిపి రుచికరమైన కూరగా వండుకుని తినవచ్చు. ఇలా చేయడం వల్ల రెండింటి పోషకాలను ఒకేసారి పొందవచ్చు. ఈ కూరను చపాతీలతో తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్‌కార్న్, పాలకూర కూర తయారీకి కావలసిన పదార్థాలు:
స్వీట్‌కార్న్ గింజలు – 2 కప్పులు
పాలకూర – 10 చిన్న కట్టలు
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 4
జీలకర్ర పొడి – అర టీస్పూన్
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టీస్పూన్
నూనె – 50 ఎంఎల్
కారం – పావు టీస్పూన్
క్రీమ్ – 10 ఎంఎల్
జీడిపప్పు ముద్ద – 2 టీస్పూన్లు
తయారీ విధానం:
స్వీట్‌కార్న్ గింజలను ఆవిరిపై 10 నిమిషాల పాటు ఉడికించి, నీటిని వడకట్టి పక్కన పెట్టాలి.ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బి ముద్దగా తయారు చేయాలి.
పాలకూరను శుభ్రంగా కడిగి నీళ్లలో వేసి ఉడికించాలి. తర్వాత నీటిని వడగట్టి, పాలకూరను మెత్తగా గ్రైండ్ చేసి ఉంచాలి.ఒక బాణలిలో నూనె వేసి, ఉల్లిపాయ ముద్దను వేసి నూనె తేలే వరకు వేయించాలి.

ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, జీడిపప్పు ముద్ద వేసి బాగా కలిపి వేయించాలి.తర్వాత పాలకూర ముద్దను వేసి కొద్దిసేపు ఉడికించాలి.ఆ తర్వాత ఉడికించిన స్వీట్‌కార్న్ గింజలు, జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి.చివరగా క్రీమ్ కలిపి స్టవ్ ఆపేయాలి.
ఇలా చేస్తే రుచికరమైన పాలకూర, స్వీట్‌కార్న్ కూర రెడీ అవుతుంది. దీన్ని చపాతీలు, పుల్కాలు లేదా రోటీలతో సర్వ్ చేసుకుని తినవచ్చు. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

