chinta chiguru karam podi:”చింత చిగురు కారంపొడి” పుల్లపుల్లగా కారంకారంగా ఎంతో టేస్టీగా..
chinta chiguru karam podi:”చింత చిగురు కారంపొడి” పుల్లపుల్లగా కారంకారంగా ఎంతో టేస్టీగా.. చింతచిగురు మార్కెట్లో కనిపిస్తే ఎట్టిపరిస్థితుల్లో వదిలేయకండి. చింతచిగురుతో కారంపొడి తయారుచేసి దాచుకుంటే, అప్పుడప్పుడు రుచిగా తినవచ్చు. ఇడ్లీ, అన్నం, దోసె… దేనితో తిన్నా రుచి అద్భుతంగా ఉంటుంది. చింతచిగురుతో అదిరిపోయే రెసిపీ

చింతచిగురులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. దీనితో తయారుచేసే వంటకాలు పుల్లగా, రుచిగా ఉంటాయి. చింతచిగురు పప్పు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే, చింతచిగురుతో కారంపొడి కూడా తయారు చేయవచ్చు. ఒక్కసారి ఈ పొడిని తయారుచేసి పెట్టుకుంటే అన్నం, దోసె, ఇడ్లీలతో రుచిగా తినవచ్చు. వేడివేడి అన్నంలో ఒక స్పూన్ చింతచిగురు కారంపొడి, అర స్పూన్ నెయ్యి కలిపి తింటే స్వర్గం ఒక్కసారిగా నోట్లోకి వచ్చినట్టు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? చింతచిగురు కారంపొడి రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం.

చింతచిగురు కారంపొడికి కావాల్సిన పదార్థాలు
1 కప్పు చింతచిగురు (శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి)
12 ఎండుమిర్చి
రుచికి సరిపడా ఉప్పు
2 స్పూన్ల నూనె
10 వెల్లుల్లి రెబ్బలు
గుప్పెడు కరివేపాకు
2 స్పూన్ల ధనియాలు
1½ స్పూన్ జీలకర్ర
చింతచిగురు కారంపొడి తయారీ విధానం
చింతచిగురును శుభ్రంగా కడిగి, ఎండలో ఆరబెట్టండి. లేదా ఫ్యాన్ కింద 2-3 రోజులు ఆరబెట్టినా సరిపోతుంది.స్టవ్ మీద కళాయి పెట్టి, ఆరిన చింతచిగురును వేయించండి. దీనివల్ల చిగురులోని తేమ పూర్తిగా పోతుంది. వేయించిన చిగురును పక్కన పెట్టుకోండి.
అదే కళాయిలో జీలకర్ర, ధనియాలు వేసి వేయించి, వాటిని కూడా పక్కన పెట్టుకోండి.ఇప్పుడు కళాయిలో 2 స్పూన్ల నూనె వేసి వేడి చేయండి.నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకులు వేసి వేయించండి. ఆ తర్వాత స్టవ్ ఆపేయండి.
మిక్సీ జార్‌లో వేయించిన చింతచిగురు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా పొడి చేయండి.ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరచండి. అంతే, చింతచిగురు కారంపొడి సిద్ధం!అన్నం తినేముందు రెండు ముద్దలు ఈ కారంపొడితో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

చింతచిగురుతో ఆరోగ్య ప్రయోజనాలు
చింతచిగురు కేవలం రుచి కోసం మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన పోషకాల కోసం కూడా తినాలి. చింతచిగురులో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది, కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చింతచిగురును తరచూ తినాలి.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. వారానికి రెండుసార్లు చింతచిగురు తినడం వల్ల మధుమేహ రోగులకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే, ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. పిల్లలు, మహిళల్లో రక్తహీనత సమస్యను తగ్గించడంలో చింతచిగురు గొప్పగా ఉపయోగపడుతుంది.

