Kitchenvantalu

Oats Halwa:నోట్లో పెట్టుకోగానే వెన్నల కరిగిపోయే ఓట్స్ హాల్వా స్వీట్..

Oats Halwa:నోట్లో పెట్టుకోగానే వెన్నల కరిగిపోయే ఓట్స్ హాల్వా స్వీట్.. ఓట్స్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. సాధారణంగా ఇవి అల్పాహారంగా ఎక్కువగా తీసుకుంటారు. కొందరు పాలతో ఓట్స్ తినడానికి ఇష్టపడితే, మరికొందరు మసాలా ఓట్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే, ఓట్స్‌తో కేవలం ఈ రెండు వంటకాలే కాదు, అద్భుతమైన హల్వా కూడా తయారు చేయవచ్చు. ఇంట్లోనే సులభంగా ఓట్స్ హల్వా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు:
నెయ్యి: 1/4 కప్పు
ఇన్‌స్టంట్ ఓట్స్: 1/2 కప్పు
పాలు: 1/2 కప్పు
చక్కెర: 1/2 కప్పు
జీడిపప్పు: 2 టేబుల్ స్పూన్లు
ఏలకుల పొడి: 1/2 టీస్పూన్

తయారీ విధానం:
ముందుగా 1/2 కప్పు ఇన్‌స్టంట్ ఓట్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి.ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి, పాన్‌ను వేడి చేయండి. అందులో ఓట్స్ వేసి, బంగారు రంగు వచ్చే వరకు దోరగా వేయించండి.వేయించిన ఓట్స్‌ను మిక్సర్‌లో వేసి మెత్తగా పొడి చేయండి. ఇది మంచి పొడి రూపంలోకి వస్తుంది.

ఇప్పుడు మరో పాన్ తీసుకొని, అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక, జీడిపప్పు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి.తర్వాత పొడి చేసిన ఓట్స్‌ను ఈ పాన్‌లో వేసి, నిరంతరం కలుపుతూ వేయించండి.ఓట్స్ వేగుతున్నప్పుడు, అందులో 1/2 కప్పు పాలు పోసి బాగా కలపండి. రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉండండి.

మిశ్రమం కాస్త చిక్కగా మారినప్పుడు, 1/2 కప్పు చక్కెర వేసి మరోసారి బాగా కలపండి.మూడు నిమిషాల తర్వాత, మరికొంత నెయ్యి (1/4 కప్పులో మిగిలినది) వేసి మళ్లీ కలపండి.మీడియం మంటపై 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండండి. చివరగా, ఏలకుల పొడి మరియు వేయించిన జీడిపప్పు వేసి మరోసారి కలపండి.అంతే! వేడి వేడిగా, తియ్యతియ్యగా ఓట్స్ హల్వా సిద్ధం. మీరు కూడా ఈ రుచికరమైన వంటకాన్ని ఇంట్లో ట్రై చేయండి!