Wheat Flour Vada Recipe: నూనె లేకుండా గోధుమపిండితో అద్భుతమైన “వడలు” – త్వరగా చేసుకోవచ్చు!
Wheat Flour Vada Recipe: నూనె లేకుండా గోధుమపిండితో అద్భుతమైన “వడలు” – త్వరగా చేసుకోవచ్చు..రోజూ చేసే వంటలకు భిన్నంగా ఈ కొత్త రెసిపీని ప్రయత్నించండి – రుచి అదిరిపోతుంది..గోధుమపిండి ప్రతి ఇంట్లో సులభంగా దొరుకుతుంది. దీనితో చాలామంది చపాతీ, పూరీ, దోసె లేదా ఇతర స్నాక్స్ తయారు చేస్తారు.
కానీ, గోధుమపిండితో వడలు కూడా చేయవచ్చని మీకు తెలుసా? అందులోనూ వీటిని నూనెలో వేయించాల్సిన అవసరం లేదు! ఆవిరిలో ఉడికించి ఆరోగ్యకరంగా, రుచిగా తినవచ్చు. తయారీ విధానం కూడా చాలా సులభం. ఈ వడలను సింపుల్‌గా లేదా ఏదైనా చట్నీతో తింటే రుచి అమోఘంగా ఉంటుంది. మరి, ఆలస్యం చేయకుండా గోధుమపిండి వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు:
గోధుమపిండి – 2 కప్పులు
ఉల్లిపాయలు – 2
అల్లం – చిన్న ముక్క
పచ్చిమిర్చి – 3
క్యారెట్ – 1
శనగపప్పు – ¼ కప్పు
కొత్తిమీర – స్వల్పంగా (తరిగినది)
ధనియాలు – 2 టీస్పూన్లు
నిమ్మరసం – అర నిమ్మకాయ నుండి
ఉప్పు – రుచికి సరిపడా
బేకింగ్ సోడా – ½ టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా అవసరమైన పదార్థాలను సిద్ధం చేసుకోండి. శనగపప్పును శుభ్రంగా కడిగి, సరిపడా నీటిలో 30 నిమిషాలు నానబెట్టండి. ఉల్లిపాయలను పొట్టు తీసి సన్నగా తరగండి. పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి పక్కన ఉంచండి.క్యారెట్, అల్లంను పొట్టు తీసి సన్నగా తురుముకోండి. కొత్తిమీరను కూడా సన్నగా తరిగి సిద్ధంగా ఉంచండి.
నానిన శనగపప్పు సిద్ధమైన తర్వాత, ఒక గిన్నెలో గోధుమపిండి, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తురిమిన క్యారెట్, అల్లం, కొత్తిమీర, నానబెట్టిన శనగపప్పు, ధనియాలు, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలపండి.కొంచెం కొంచెంగా నీరు పోస్తూ, పిండిని మెత్తగా ముద్దలా కలుపుకోండి.ఇప్పుడు 2 టీస్పూన్ల నూనె వేసి మరోసారి కలిపి పక్కన పెట్టండి.
స్టవ్ ఆన్ చేసి, ఇడ్లీ పాత్రలో నీరు పోసి మరిగించండి. ఈ లోపు ఇడ్లీ ప్లేట్‌లకు స్వల్పంగా నూనె రాయండి.కలిపిన పిండిని చిన్న చిన్న భాగాలుగా తీసుకొని వడల ఆకారంలో వత్తుకొని ఇడ్లీ ప్లేట్‌లో అమర్చండి.అన్ని వడలను ఇలా సిద్ధం చేసి, నీరు మరుగుతున్న ఇడ్లీ పాత్రలో ప్లేట్‌లను ఉంచి, హై ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఉడికించండి.
ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌కు తగ్గించి, సుమారు 15 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.5 నిమిషాల తర్వాత వడలను ప్లేట్‌లోకి తీసుకొని, కొద్దిగా నెయ్యి రాసుకొని సర్వ్ చేయండి. రుచికరమైన, ఆరోగ్యకరమైన గోధుమపిండి వడలు సిద్ధం! నచ్చితే మీరూ ట్రై చేయండి.
చిట్కాలు:
ఉల్లిపాయ, క్యారెట్‌తో పాటు క్యాబేజీ వంటి ఇతర కూరగాయల తరుగును కూడా జోడించవచ్చు.వడలు బాగా ఉడికాయో లేదో తెలుసుకోవడానికి, 20 నిమిషాల తర్వాత మూత తెరిచి, స్పూన్ లేదా చాకును వడలో గుచ్చండి. పిండి అంటుకోకపోతే ఉడికినట్లు. అంటుకుంటే మరికొంత సేపు ఉడికించండి.

