Business

SBI Insurance:SBI కస్టమర్లకు అలర్ట్: కేవలం రూ.20 లకే రూ. 2 లక్షల ఇన్సూరెన్స్.. వెంటనే ఇలా అప్లై చేసుకోండి!

SBI Insurance:SBI కస్టమర్లకు అలర్ట్: కేవలం రూ.20 లకే రూ. 2 లక్షల ఇన్సూరెన్స్.. వెంటనే ఇలా అప్లై చేసుకోండి..రోజువారీ ఖర్చుల్లో 20 రూపాయలు అంటే మనం పెద్దగా లెక్కచేయం. కానీ, అదే 20 రూపాయలు మీ కుటుంబానికి ఏకంగా రూ.2 లక్షల ఆర్థిక భద్రత కల్పిస్తుందని మీకు తెలుసా? అవును, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎక్స్ (Twitter) వేదికగా మరోసారి గుర్తుచేస్తోంది.

ప్రమాదాలు చెప్పి రావు. కానీ, ముందుచూపుతో చేసే చిన్న పొదుపు మన కుటుంబానికి కొండంత అండగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన’ (PMSBY) ద్వారా ఈ ప్రయోజనాన్ని ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి.

అసలు ఈ PMSBY పథకం ఏంటి?
ఇది కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నడిచే ‘వ్యక్తిగత ప్రమాద బీమా పథకం’. ఏడాదికి కేవలం రూ.20 ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పొందవచ్చు. బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో అకౌంట్ ఉన్నవారు ఈ పథకంలో చేరడానికి అర్హులు.

ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఇలా ఉంటాయి:
ప్రమాదవశాత్తు మరణిస్తే: బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే వారి నామినీకి లేదా కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు అందుతాయి.

పూర్తి అంగవైకల్యం వస్తే: ప్రమాదంలో రెండు కళ్ళు, రెండు చేతులు లేదా రెండు కాళ్లు కోల్పోయి శాశ్వత వైకల్యం వస్తే రూ. 2 లక్షలు చెల్లిస్తారు.

పాక్షిక అంగవైకల్యం వస్తే: ఒక కన్ను, ఒక చెయ్యి లేదా ఒక కాలు మాత్రమే కోల్పోయినట్లయితే రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందుతుంది.

ప్రకృతి విపత్తులు కూడా: వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల వల్ల జరిగే ప్రాణనష్టం కూడా ఇందులో కవర్ అవుతుంది (ఆత్మహత్యలకు మాత్రం వర్తించదు).

ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి?
వయసు: 18 సంవత్సరాల నుండి 70 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఎన్ఆర్ఐ (NRI) లు కూడా తమ భారతీయ బ్యాంక్ ఖాతాల ద్వారా ఇందులో చేరవచ్చు. జాయింట్ అకౌంట్ ఉన్నవారు కూడా తలా రూ.20 చెల్లించి ఎవరికి వారు విడిగా బీమా పొందవచ్చు.

ప్రీమియం చెల్లింపు చాలా సులభం!
దీనికోసం మీరు ఏజెంట్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీ బ్యాంక్ ఖాతాకు ‘ఆటో-డెబిట్’ ఆప్షన్ ఇస్తే చాలు. ప్రతి సంవత్సరం మే నెల చివర్లో మీ అకౌంట్ నుంచి రూ.20 ఆటోమెటిక్ గా కట్ అవుతాయి. బీమా కవరేజ్ ఏటా జూన్ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది.

రోజుకు కేవలం 5 పైసల ఖర్చుతో (ఏడాదికి రూ.20) మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఈ పథకంలో ఇంకా చేరకపోతే వెంటనే మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించండి లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసుకోండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/