డబుల్ రోల్ అంటే బాక్సాఫీస్ బద్దలే.. ద్విపాత్రాభినయంలో బాలయ్య సృష్టించిన రికార్డులు ఇవే!
నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు వింటేనే థియేటర్లలో పూనకాలు మొదలవుతాయి. ఆయన తెరపై కనిపిస్తే ఆ మాస్ జాతర ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే, బాలయ్య ఒకే సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తే.. అభిమానులకు ఆ కిక్కే డబుల్.
తండ్రి ఎన్టీఆర్ తర్వాత ద్విపాత్రాభినయంలో ఆ రేంజ్ మార్క్ క్రియేట్ చేసింది ముమ్మాటికీ బాలకృష్ణ మాత్రమే. ఒక పాత్రలో క్లాస్.. మరో పాత్రలో ఊర మాస్.. ఇలా వేరియేషన్స్ చూపిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఆయనకే చెల్లింది. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో బాలయ్య ఎన్ని సినిమాల్లో డబుల్ రోల్స్ చేశారో.. ఆ సూపర్ హిట్ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం!
డబుల్ రోల్స్.. డబుల్ బ్లాక్‌బస్టర్స్!
1986లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ సహోదరులు’ సినిమాతో బాలయ్య డబుల్ రోల్ ప్రయాణం మొదలైంది. ఆ మూవీ అప్పట్లో సెన్సేషనల్ హిట్. అక్కడి నుంచి మొన్నటి ‘వీరసింహారెడ్డి’ వరకు ఆయన ద్విపాత్రాభినయం చేసిన ప్రతీసారి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయబడ్డాయి. తన కెరీర్‌లో ఏకంగా 16 సినిమాల్లో బాలయ్య రెండు పాత్రలు (ఒక సినిమాలో మూడు పాత్రలు) పోషించారు.

అపూర్వ సహోదరులు (1986): బాలయ్యకి ద్విపాత్రాభినయంలో తొలి సక్సెస్ ఇచ్చిన చిత్రం. భార్గవ రామ్, రాముగా అలరించారు.
రాముడు భీముడు (1988): సీనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ టైటిల్‌తో వచ్చి, రాముడు, భీముడుగా రెండు డిఫరెంట్ షేడ్స్ చూపించారు.
ఆదిత్య 369 (1991): టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్. ఒకవైపు శ్రీకృష్ణదేవరాయలు గంభీరత్వం, మరోవైపు యువకుడు కృష్ణకుమార్ చలాకీతనం.. అద్భుతంగా పండించారు.
మాతో పెట్టుకోకు (1995): కిచ్చా, అర్జున్ అనే విభిన్న పాత్రల్లో తనదైన మార్క్ వేశారు.
పెద్దన్నయ్య (1997): భవానీ ప్రసాద్, రామకృష్ణ ప్రసాద్‌గా నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేశారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్.
సుల్తాన్ (1999): పృథ్వి, సుల్తాన్ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ చేశారు.
చెన్నకేశవరెడ్డి (2002): రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీకొడుకులుగా (చెన్నకేశవరెడ్డి, భరత్) బాలయ్య నటవిశ్వరూపం చూపించిన మాస్ క్లాసిక్.
అల్లరి పిడుగు (2005): రంజిత్, గిరి అనే అన్నదమ్ములుగా అలరించారు.
ఒక్క మగాడు (2008): వృద్ధుడిగా, యువకుడిగా రెండు విభిన్నమైన గెటప్స్‌లో వైవిధ్యం చూపించారు.
పాండురంగడు (2008): ఒకరు భగవంతుడు (శ్రీకృష్ణుడు), మరొకరు భక్తుడు (పాండురంగడు).. రెండు పాత్రల్లో జీవించారు.
సింహా (2010): డాక్టర్ నరసింహ, శ్రీమన్నారాయణ. బోయపాటితో బాలయ్య బాక్సాఫీస్ వేట మొదలైంది ఇక్కడి నుంచే!
అధినాయకుడు (2012): ఇందులో డబుల్ కాదు ట్రిపుల్ రోల్. తాత, కొడుకు, మనవడు (హరిశ్చంద్ర ప్రసాద్, రామకృష్ణ ప్రసాద్, బాబీ).. మూడు జనరేషన్స్ పాత్రలతో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టారు.
లెజెండ్ (2014): జయదేవ్, కృష్ణ.. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను మడతపెట్టేసింది.
లయన్ (2015): గోడ్సే, బోస్ అని సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్న రెండు డిఫరెంట్ రోల్స్.
అఖండ (2021): అఖండ రుద్ర సికందర్ అఘోర, మురళీకృష్ణ. అఘోరగా బాలయ్య నట తాండవమే చేశారు.
వీరసింహారెడ్డి (2023): తండ్రి వీరసింహారెడ్డి, కొడుకు జై సింహారెడ్డిగా తన వింటేజ్ మాస్ స్వాగ్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను కుమ్మేశారు.
సక్సెస్ ఫార్ములా ఇదే.. ఫ్లాష్‌బ్యాక్ వస్తే గూస్‌బంప్సే!
ఈ లిస్ట్ గమనిస్తే ఒక విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. అన్నదమ్ములుగా నటించినా, తండ్రీకొడుకులుగా నటించినా.. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ వేరు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే తండ్రి/పెద్దన్న పాత్ర (చెన్నకేశవరెడ్డి, సింహా, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి) సినిమాను తారస్థాయికి తీసుకెళ్తుంది.
ఆ గెటప్‌లో బాలయ్య కళ్లలో రౌద్రం, రాజసం ఉట్టిపడే నడక, తొడగొట్టి చెప్పే డైలాగ్స్ చూస్తే అభిమానులకు థియేటర్లలో జాతరే. ద్విపాత్రాభినయంలో బాలయ్య సృష్టించిన ఈ బ్రాండ్‌ను రీప్లేస్ చేయడం ఎవరి తరం కాదు!
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

