పూజలు, ఉపవాసాల్లో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు వాడరు? చాలామందికి తెలియని అసలు కథ!
మన హిందూ సంప్రదాయంలో పండుగలు, పూజలు, వ్రతాలు వచ్చినప్పుడు భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండటం ఆనవాయితీ. అయితే ఇలా ఉపవాసం ఉండే రోజుల్లో లేదా దేవుడికి నైవేద్యం పెట్టే వంటల్లో ఇంట్లో పెద్దవాళ్లు ఒక నియమాన్ని కచ్చితంగా పాటిస్తారు. అదేంటంటే.. ఆ రోజు వంటల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు వేయకపోవడం!
నిజానికి ఉల్లిపాయ, వెల్లుల్లి రెండూ భూమిలో పండే కూరగాయలే కదా.. అవి మాంసాహారం కూడా కాదు. మరి పక్కా శాకాహారమైన వీటిని పూజలు, ఉపవాసాల సమయంలో ఎందుకు దూరం పెడతారు? అనే సందేహం మనలో చాలామందికి వచ్చే ఉంటుంది. దీని వెనుక ఆయుర్వేద కారణాలతో పాటు, మన పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అసలు ఆ కథ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. సముద్ర మథనం.. మోహిని అవతారం
పురాణాల ప్రకారం, పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. ఆ సముద్ర మథనం నుండి అమృతం ఉద్భవించగానే, దాన్ని దక్కించుకోవడానికి దేవతలకు, రాక్షసులకు మధ్య పెద్ద వివాదం మొదలైంది. అప్పుడు రాక్షసుల చేతికి అమృతం చిక్కకుండా ఉండేందుకు శ్రీమహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తారు. తన అందంతో రాక్షసులను మాయ చేసి, దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచడం ప్రారంభించారు.
2. రాక్షసుడి వేషం.. సుదర్శన చక్రంతో శిక్ష!
విష్ణుమూర్తి అంతా గమనిస్తూ అమృతం పంచుతున్న సమయంలో.. ‘స్వర్భానుడు’ అనే ఒక రాక్షసుడు మోహిని మాయను పసిగట్టాడు. వెంటనే దేవతల రూపం ధరించి, రహస్యంగా సూర్యచంద్రుల మధ్యలో వెళ్లి కూర్చున్నాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆ రాక్షసుడికి కూడా అమృతాన్ని పోశారు.
అయితే ఆ రాక్షసుడు అమృతాన్ని గొంతులోకి మింగబోయే సమయానికి, సూర్యచంద్రులు అతడిని గుర్తించి విష్ణుమూర్తికి అసలు విషయం చెప్పారు. వెంటనే శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలను నరికేశారు. కానీ అప్పటికే అమృతం ఆ రాక్షసుడి గొంతు వరకు వెళ్లడంతో అతను చనిపోలేదు. ఆ తల భాగం ‘రాహువు’గా, మొండెం భాగం ‘కేతువు’గా మారాయని పురాణాలు చెబుతున్నాయి.

3. ఉల్లిపాయ, వెల్లుల్లి ఎలా పుట్టాయి?
విష్ణుమూర్తి చక్రంతో రాక్షసుడి తలను ఖండించినప్పుడు, ఆ రాక్షసుడి గొంతు నుండి అమృతంతో కలిసిన కొన్ని రక్తపు చుక్కలు భూమి మీద పడ్డాయట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట నుండే భూమిపై ఉల్లిపాయ, వెల్లుల్లి మొక్కలు పుట్టుకొచ్చాయని పౌరాణిక గాథలు చెబుతున్నాయి.
అమృతం తగిలిన రక్తం కాబట్టి వీటికి మనిషి ఆరోగ్యాన్ని కాపాడే ఔషధ గుణాలు (Medicinal Values) వచ్చాయని.. కానీ రాక్షసుడి రక్తం నుండి పుట్టాయి కాబట్టి వీటికి ఆ ఘాటైన వాసన, తామసిక గుణం వచ్చాయని నమ్ముతారు. రాక్షస అంశతో పుట్టాయి కాబట్టే దేవుడి నైవేద్యాల్లో గానీ, ఉపవాస దీక్షల్లో గానీ వీటిని వాడకూడదనే ఆచారం మొదలైంది.
4. సాత్విక ఆహారం & మనసుపై ప్రభావం
పురాణ కథ పక్కన పెడితే, మన ఆయుర్వేదం మరియు శాస్త్రాల ప్రకారం ఆహారాన్ని సాత్విక, రాజసిక, తామసిక ఆహారాలుగా విభజించారు.
పూజలు, ధ్యానం, ఉపవాసం చేసేటప్పుడు మనసు చాలా ప్రశాంతంగా, దైవ చింతనలో ఉండాలి. అందుకే ఆ సమయంలో కేవలం సాత్విక ఆహారం (పండ్లు, పాలు, తేలికపాటి ఆహారం) మాత్రమే తీసుకుంటారు.
ఉల్లిపాయ, వెల్లుల్లి రాజసిక మరియు తామసిక గుణాలను కలిగి ఉంటాయి. వీటిని తిన్నప్పుడు శరీరంలో వేడి పెరగడం, మనసులో కోరికలు, ఆవేశం, బద్ధకం లేదా నిద్ర మత్తు కలగడం జరుగుతుంది. దీనివల్ల పూజలపై ఏకాగ్రత కుదరదని పెద్దలు వీటిని నిషేధించారు.
ఏదేమైనా ఆరోగ్యానికి ఉల్లి, వెల్లుల్లి ఎంతో మేలు చేసే ఔషధాలే అయినప్పటికీ.. పూజలు, వ్రతాల సమయంలో మనసును, శరీరాన్ని నిర్మలంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే మన పెద్దవారు ఈ నియమాన్ని పెట్టారు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

