ఎన్నికల వేళ జగన్ ఇంట తీవ్ర విషాదం…షాక్ లో వైసీపీ నేతలు
మాజీమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పులివెందులలోని స్వగృహంలో ఈ రోజు తెల్లవారుజామున వివేకానందరెడ్డి తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత ఆయన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి కొనసాగుతూ వచ్చారు వివేకానందరెడ్డి. పలుసార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా, మరికొన్ని సార్లు కడప ఎంపీగా వివేకానందరెడ్డి వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్రమంత్రివర్గంలో చేరిన వివేకానందరెడ్డి… కొంతకాలం వ్యవసాయశాఖమంత్రిగా సేవలందించారు.

అనంతరం కాంగ్రెస్ను వీడి వైసీపీలో చేరిన వైఎస్ వివేకానందరెడ్డి డి కడప స్థానిక సంస్థ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కొద్దిరోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటూ వైసీపీ వ్యవహారాలను చక్కబెడుతున్న వివేకానందరెడ్డి హఠాన్మరణం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

