Politics

పవన్‌కళ్యాణ్‌ కూడా పాదయాత్ర చెయ్యాల్సిందేనా?

రాష్ట్రంలో ఎవరైనా ఆహ్ధికారంలోకి రావాలంటే, అందుకు సరైన మందు పాదయాత్ర అని సెంటిమెంట్ గా మారిపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రతోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా వైఎస్‌ జగన్‌ కూడా పాదయాత్ర చేయడం ద్వారా ప్రజల మనసుల్లో చోటు దక్కించుకున్నారు, ముఖ్యమంత్రి పీఠమెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పాదయాత్ర చేయాలనే ఆలోచనలో వున్న ట్టు వార్తలొస్తున్నాయి. 

‘గ్రామ యాత్ర’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ అంతటా పర్యటిం చాలని పవన్ నిర్ణయించారట. పవన్‌కళ్యాణ్‌పై కూడా పాదయాత్ర చేయాలనే ఒత్తిడి పార్టీ నేతలనుంచి పెరుగుతోంది. దీంతో జనసేన పార్టీ సీనియర్‌ నేతలు సమాలోచనలు జరుపుతున్నార ని, అతి త్వరలోనే పవన్‌కళ్యాణ్‌ గ్రామ యాత్రకు సంబంధించి ఓ ప్రకటన అధికారికంగా జనసేన నుంచి రాబోతోందని టాక్ నడుస్తోంది. అయితే వైఎస్‌ జగన్‌లా పవన్‌కళ్యాణ్‌ సుదీర్ఘ పాదయాత్ర చేయగలరా? అందుకు తగిన ఆర్థిక వనరులు జనసేన పార్టీకి వున్నాయా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఇక్కడ మరో డిమాండ్ ఫాన్స్ నుంచి వస్తోంది. పాదయాత్ర కంటే ముందు ఓ సినిమాలో నటించాలని ఫాన్స్ కోరుతున్నారు. ఇక పార్టీ నేతలు కూడా సీనిమా గురించి పవన్‌కళ్యాణ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. పవన్‌కళ్యాణ్‌ కోసం దాదాపుగా ఐదు నుంచి ఎనిమిది నిర్మాణ సంస్థలు, డజనుకు పైగా దర్శకులు సిద్ధంగా వున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి కూడా పవన్‌కళ్యాణ్‌ తన సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికలు జరిగి పవన్ రెండు చోట్లా ఓడిపోవడం,పార్టీ కేవలం ఒక్కచోటే గెలవడం నేపథ్యంలో అసలు పవన్ ఇప్పుడు పాదయాత్ర కంటే సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెడతారన్న టాక్ వస్తోంది.