Movies

అవమానాలు దాటి బుల్లితెర నుండి సినిమాల వరకు హిమజ ప్రయాణం…ఇప్పుడు బిగ్ బాస్ లోకి

విజయవాడకు చెందిన హిమజ బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చి,వెండితెరమీద కూడా దూసుకెళ్తోంది. మంగళగిరికి దగ్గరలోని వేర్లపాలెం అనే ఊళ్ళో ఓ సామాన్య ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో 1990నవంబర్ 2న పుట్టిన ఈమె హైదరాబాద్ లో డిగ్రీ వరకూ చదివింది. సామాజిక శాస్త్రం బోధించే టీచర్ గా చేసి,ఆతర్వాత ఓ కంపెనీకి హెచ్ ఆర్ గా పనిచేసిన హిమజకు ఉద్యోగం అంటే నచ్చక ఇంటికి వచ్చేసింది. అయితే ఆమెను నటన వైపు ఎంకరేజ్ చేయడంలో ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి మొదటి వారు. 

ఆర్టీసీ లో పాతికేళ్ళు పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి ఆతర్వాత సర్వాంతర్యామి అనే టెలి ఫిలిం కి మాటలు,పాటలు రాసారు. హిమజ అప్పుడు ఇంటర్ చదువుతూ ఈ టెలీఫిల్మ్ లో నటించింది. అందుకే నటన అనుభవంతో టివి రంగంలోకి అడుగుపెట్టి భార్యామణి,స్వయంవరం,కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్స్ లో నటిస్తున్న సమయంలోనే ,సినిమాల్లో క్యారెక్టర్  ఆర్టిస్టుగా ఛాన్స్ లు వచ్చాయి. ఎన్నో అడ్డంకులు అధిగమించి, ఛాన్స్ ల కోసం ఎదురుచూసి,నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హిమజ, ఎన్నో పరాభవాలు కూడా చూసింది. 

లుక్ బాగోలేదు, నీ ముఖానికి మేకప్ సరిగ్గా పడదు, ఎంత చెప్పినా ఇంతేనా, నటనలో మెరుగు పడాలి ఇలా ఎన్నో మాటలను పడాల్సి వచ్చింది. శివమ్ సినిమాలో హీరోయిన్ రాశీఖన్నాకు ఫ్రెండ్ గా నటించింది. నేను శైలజ,చందమామ రావే,జనతా గ్యారేజ్,ధ్రువ,శతమానం భవతి,ఉన్నది ఒకటే జిందగీ,చుట్టాలబ్బాయి, ,స్పైడర్,వేటకొడవళ్లు వంటి మూవీస్ లో చేసింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ రియాల్టీ షో ను కూడా ఎంచుకుంది. అక్కడ ఎలాంటి రేంజ్ కి వెళ్తుందో మరి.