సినిమా షూటింగ్స్ ఇప్పట్లో లేనట్టేనా…ఇక సినిమాలు రిలీజ్ వచ్చే సంవత్సరమే… !
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా షరతులతో షూటింగ్స్ కి అనుమతిచ్చినా ఇంకా షూటింగ్స్ స్టార్ట్ కావడం లేదు. కరోనా కేసులు రోజురోజుకీ విజృంభిస్తుండడమే దీనికి కారణం. పైగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు ఆయన ఫ్యామిలీకి,అనుపమ ఖేర్ కుటుంబానికి,ఇంకా పలువురు సినీ,టివి నటులకు కూడా కరోనా ఎఫెక్ట్ కావడంతో షూటింగ్స్ కి వెళ్ళటానికి టాలీవుడ్ స్టార్స్ జంకుతున్నారు.
అసలు అనుమతి కోసం సినిమా పెద్దల తెలుగు రాష్ట్రాల సీఎం లను కల్సి విన్నవించడం, షూటింగులకు అనుమతి రావడంతో అర్థాంతరంగా ఆగిపోయిన సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేయాలని భావించారు. అయితే కరోనా రోజురోజుకి విజృభిస్తుండటంతో రిస్క్ తీసుకొని షూటింగ్ ప్రారంభించడానికి ముందుకు రావడంలేదు. అందుకే టాలీవుడ్ లో సినిమాల షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే దాని మీద స్పష్టత రాలేదు.
ఇప్పటి వరకు సెప్టెంబర్ నుంచి షూటింగ్స్ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయని అందరూ అనుకున్నారు. ఇప్పుడు కరోనా తీవ్రత పెరుగుతుండటంతో కొన్ని ఏరియాల్లో లాక్ డౌన్ విధిస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పటికే 80 శాతం పైన షూటింగ్ జరుపుకొని.. 10 నుండి 15 రోజుల్లో కంప్లీట్ అయ్యే చిత్రాలు మాత్రం రిస్క్ తీసుకొని అక్టోబర్ లో సెట్స్ పై వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్యాచ్ వర్క్ మిగిలి ఉన్న కొన్ని చిన్న సినిమాలు చిత్రీకరణ స్టార్ట్ చేసాయి.
ఇక పెద్ద సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది చివర్లో లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో రెగ్యులర్ షూట్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా కరోనాతో కొంతకాలం సహజీవనం చేయాల్సిందే అనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ వచ్చే దాకా షూటింగ్ లో పాల్గొనలేమని కొంతమంది నటీనటులు తేల్చి చెప్పేస్తున్నారట. స్టార్ హీరోలైతే ఇప్పట్లో షూటింగ్ విషయంలో రిస్క్ తీసుకోకపోవడమే మంచిందని చెప్తున్నారట. ఇప్పటికే ఈ ఏడాది సగం గడిచిపోయింది. పైగా థియేటర్స్ రీ ఓపెనింగ్ విషయంపై కూడా స్పష్టత లేదు. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు థియేటర్స్ లో బొమ్మ పడకపోవచ్చని ఈ మహమ్మారి వలన మరో ఆరు నెలల సమయం కూడా వృధాగా పోతుందని సినీ పండితుల విశ్లేషణ.
