ఆ ప్రమాదం నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఎలా తప్పించుకున్నాడో తెలుసా ?
సినిమా నటులు రిస్కీ షాట్స్ లో నటించడం వలన ఒక్కోసారి ప్రాణాపాయ స్థితిలో పడుతుంటారు. గూఢచారి,జేమ్స్ బ్యాండ్ వంటి మూవీస్ కి తెలుగులో శ్రీకారం చుట్టి ఎన్నో మూవీస్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ ఎన్నోసాహస దృశ్యాల్లో పాల్గొన్నారు. ఎప్పుడు ప్రమాదం రాలేదు. కానీ అనుకోకుండా సిరిపురం మొనగాడు మూవీలో జరిగిన ప్రమాద ఘటన కృష్ణ మదిలో నిలిచిపోయింది. కె ఎస్ ఆర్ దాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో కృష్ణ త్రిపాత్రాభినయం చేసారు. జయప్రద,కే ఆర్ విజయ హీరోయిన్స్ గా చేసారు. శ్రీకాంత్ నహతా ఈ మూవీ తీశారు. ఈ సినిమాలో ప్రమాదం అంచు వరకూ వెళ్లి బయట పడడంతో కృష్ణ ఫాన్స్ కి విషయం తెల్సి ఆందోళన చెందారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన తర్వాత అందరూ ఉలిక్కి పడ్డారు.
ఈ మూవీ షూటింగ్ ఊటీలో ప్లాన్ చేయడంతో 1983ఫిబ్రవరి 11న కృష్ణ ఊటీ చేరుకున్నారు. ఆరోజు మహాశివరాత్రి కూడా. మధ్యాహ్నం 12కి షూటింగ్ స్టార్ట్ అయింది. లంచ్ బ్రేక్ ఇచ్చారు. మధ్యాహ్నం 2.15కి మళ్ళీ షూటింగ్ స్టార్ట్. సుత్తివేలు,మమత , ఏచూరి , మరో 30మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. 5గురు ఫైటర్స్, గుర్రాలు,నాలుగైదు ఫిరంగులు ఉన్నాయి. ఫిరంగిలో మందు నింపి కాగడాతో వెలిగిస్తే .. బాంబ్ పేలాలి. ఎందుకంటే ఆ ఊళ్లోకి దొంగలు వస్తుంటే ఎదుర్కొనే సీన్ అది. ఫైట్ మాస్టర్ రాఘవులు, బాంబ్ స్క్వాడ్ అందరూ ఉన్నారు. అయితే కాగడాతో వెలిగిస్తే పేలకుండా తుస్సుమనడంతో మళ్ళీ కొంతమందు కూరారు. అప్పుడు సుత్తివేలు కాగడాలతో వెలిగించేసరికి ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ ని తలపించేలా అయింది. పైగా రివర్స్ లో దూసుకురావడంతో కృష్ణ గాయాలతో పడిపోయారు.
సుత్తివేలు వేళ్ళకు,కె ఎస్ ఆర్ దాస్ కాలికి కూడా గాయాలయ్యాయి. దీంతో నిర్మాత శ్రీకాంత్ నహతాకు వణుకుపుట్టింది. వెంటనే కృష్ణను ఆసుపత్రికి తరలించారు. హోటల్ లో ఉన్న విజయనిర్మలకు వర్తమానం పంపడంతో ఆమె కూడా హాస్పిటల్ కి చేరుకున్నారు. అయితే పొట్టమీద,చేతికి గాయాలవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముఖానికి గానీ, గుండెకు గానీ తగిలి ఉంటె ఏమయ్యేదో చెప్పక్కర్లేదు. ఊటిలోనే షూటింగ్ లో ఉన్న శోభన్ బాబు వచ్చి పలకరించారు. ఇక కోల్ కత్తాలో ఉన్న కృష్ణ బ్రదర్స్ ఆదిశేష గిరిరావు, హనుమంతరావు ఆగమేఘాల మీద ఊటీ చేరారు. వెంటనే చెన్నై వెళ్లాలని భావించినప్పటికీ ఫాన్స్ తాకిడి ఎక్కువ ఉంటుందని నాలుగు రోజులు ఆగి, అప్పుడు చెన్నై వచ్చి విజయ ఆసుపత్రిలో చేరారు. 10రోజుల తర్వాత షూటింగ్ కి రెడీ అయినప్పటికీ వైద్యుల సూచనమేరకు కొన్నాళ్ళు ఆగారు. మొత్తానికి అప్పట్లో బిజీ హీరో కృష్ణకు ఇలా అవ్వడంతో చాలామంది ప్రొడ్యూసర్స్ భయపడ్డారు.

