Movies

సినిమాలు తీసి సంపాదించిందంతా కోల్పోయిన నాజర్ మళ్లీ ఎలా కోలుకున్నాడో తెలుసా?!

తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న అతి కొద్దిమంది పరభాషా నటుల్లో నాజర్ కూడా ఒకరు. తన అద్భుతమైన నటనతో ఏ పాత్రలోనైనా లీనమైపోయి ఎన్నో తెలుగు సినిమాలకు ప్రాణం పోశారాయన. అందుకే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయారు. ఆయన కూడా అంతే.. తెలుగును పరాయి భాషగా భావించకుండా పూర్తిగా నేర్చేసుకుని తన డబ్బింగ్ తానే చెప్పుకుంటారు మరి.. తాను చేస్తున్న పనిపై అద్భుతమైన కమిట్మెంట్ ఉన్న నాజర్.. ఒకప్పుడు ఇండస్ట్రీలో పూర్తిగా దివాలా తీసేసి ఉన్నదంతా పోగొట్టుకున్న సంగతి ఎంతమందికి తెలుసు? అలాంటి పరిస్థితుల్లో మళ్లీ నటననే నమ్ముకుని లేచి నిలదొక్కుకుని ఇప్పుడీ స్థాయిలో ఉన్నారట. ఇంతకూ తన ఆస్తి మొత్తం ఎలా పోయిందో, తిరిగి ఎలా కోలుకున్నాడో స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ విషయాలు మీకోసం..

నాజర్ తండ్రి ఒక స్టేజి ఆర్టిస్టు. నాజర్ బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నారు. కానీ ఆయన తండ్రి మాత్రం నాజర్ ను నటుడిగా చూడాలనుకున్నారు. నాన్న కోరిక మేరకు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. చేసేది లేక తాజ్ హోటల్లో వెయిటర్ గా చేరారు. అందులో పని చేసినంత కాలం సినిమాల విషయం మరిచిపోయారట. అప్పట్లోనే తనకు నెలకు 300 రూపాయలు జీతంతో పాటు టిప్పులు కూడా వచ్చేవట. ఐతే తండ్రి బలవంతం చేయడంతో మళ్లీ ఆ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారట నాజర్. దానికితోడు అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో మెలకువలు నేర్చుకున్నారట. ఆ ఇన్స్టిట్యూట్లో నాజర్ నటుడిగా గోల్డ్ మెడల్ సాధించారు.
అయితే…

ఆ గోల్డు మెడలేమీ సినిమా ఛాన్సులు రావడానికి కొంచెం కూడా సాయం చేయలేకపోయిందట. అది ఎవరికి చూపించినా గుడ్ అంటూ ప్రశంసించడమే కానీ చాన్సిచ్చేవారు మాత్రం లేరట. దీంతో ఆయన రూటు మార్చి డబ్బింగ్ ఆర్టిస్టు అయ్యారు. కొద్దికాలానికి ‘నాయకుడు’ సినిమాతో నాజర్ కెరీర్ మలుపు తిరిగింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఐతే అడయార్ ఇనిస్టిట్యూట్ లో ఉన్నప్పుడు యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ కూడా నేర్చుకున్నారు. ఆ సరదాతో సొంతంగా సినిమా నిర్మాణం మొదలుపెట్టారాయన. అదే అవతారం సినిమా.. అలా నాలుగు సినిమాలు నిర్మించారు.. అన్నీ డిజాస్టర్లే. మొత్తం రూ.2.5 కోట్లు పోగొట్టుకుని రోడ్డున పడ్డారట. దాంతో మళ్లీ నటనపై ఫోకస్ చేసి అవకాశాలు అందుకోవడంతో ఆ నష్టం నుంచి బయటపడడమే కాకుండా స్థిరపడగలిగారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."