ఈ రాయలసీమ స్పెషల్ ‘చిట్లం పొడి’ ఉంటే ఇంక చట్నీలతో పనేముంది! రుచి అదుర్స్ అంతే..
Rayalaseema Special Chitlam Podi Recipe: ఉదయం హడావిడిలో ఇడ్లీ, దోశల్లోకి చట్నీ చేసే సమయం లేదా? అయితే మీకు బెస్ట్ ఆప్షన్ ‘రాయలసీమ స్పెషల్ చిట్లం పొడి’. ఈ పొడి ఇంట్లో ఉంటే ఇక చట్నీలతో పనేముంది!
ఇడ్లీ, దోశ, ఉప్మా, వేడి వేడి అన్నం.. ఇలా దేంట్లోకైనా ఈ చిట్లం పొడిని నెయ్యితో కలిపి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. కమ్మటి సువాసనతో, అదిరిపోయే టేస్ట్‌తో నోరూరించే ఈ రాయలసీమ స్పెషల్ కారం పొడిని చాలా తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే సాధారణ దినుసులతోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ బ్లాగ్‌లో వివరంగా చూద్దాం.

శనగపప్పు,కందిప్పులకు కాసిన్ని మిరియాలు జోడించి ఎండుమిర్చి ఘూటు తగిలించి పొడి చేసి పెట్టుకున్నారంటే ఇడ్లీ, దోస, వడ లాంటి టిఫిన్స్ లోకి చట్నీతో పనేఉండదు. మరీ చిట్లం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మినపప్పు- ¼ కప్పు
పచ్చి శనగపప్పు- ¼ కప్పు
కంది పప్పు – ¼ కప్పు
చింతపండు- ఉసిరికాయంత
ఎండుమిర్చి – 20-30
మిరియాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
వెల్లుల్లి – ఆప్షనల్
ఇంగువ,బెల్లం- ఆప్షనల్
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని మూడు పప్పులకు సన్నని సెగపై దోరగా వేయించి చల్లారినివ్వాలి.
2.అదే ప్యాన్ లో మిరపకాయలను కూడ వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
3.తర్వాత జీలకర్ర,మిరియాలు కూడ వేపుకోని పప్పులలో కలుపుకోవాలి.
4.చింతపండును కూడ కాసేపు వేడి పెనం పై వేపి తీసుకోవాలి.
5.ముందు మిక్సిజార్ లో చల్లారిని మిర్చి,ఉప్పు,చింతపండు వేసి మిర్చీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
6.అందులోకి చల్లారిని పప్పుల్ని,మిరియాలని కూడా వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
7.నచ్చితే అందులోకి వెల్లుల్లి కూడ వేసుకోని గ్రైండ్ చేసుకోవొచ్చు.
8.గ్రైండ్ చేసుకున్న పొడిని ఎయిర్ టైట్ కంటేనర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు నెలల వరకూ ఫ్రెష్ గా ఉంటుంది.

