Monsoon Destinations: మాన్ సూన్ లో ఖచ్చితంగా ఈ ప్రదేశాలకు వెళ్ళాల్సిందే..
Monsoon Destinations: మాన్ సూన్ లో ఖచ్చితంగా ఈ ప్రదేశాలకు వెళ్ళాల్సిందే.. ఎండాకాలంలో భానుడి భగభగలతో అలసిపోయిన ప్రజలకు రుతుపవనాలు ఉపశమనం తెచ్చి, ఆనందాన్ని అందిస్తాయి. ఇప్పటి వరకు మూలన పడి ఉన్న గొడుగులు విప్పుకుని వీధుల్లో సంచరిస్తాయి.
వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో ప్రకృతి పచ్చని అంచెలు కప్పుకుని మనోహరంగా కనిపిస్తుంది. పొగమంచుతో కూడిన ఉదయాలు, పచ్చని కొండల మధ్య వేడి వేడి చాయ్‌ను ఆస్వాదించే వారికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సందర్శించదగిన అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
మహాబలేశ్వర్, మహారాష్ట్ర
పశ్చిమ కనుమలలోని ఈ హిల్ స్టేషన్ వర్షాకాలంలో అద్భుతమైన దృశ్యాలతో కనువిందు చేస్తుంది. స్ట్రాబెర్రీ తోటలు, విశాలమైన వ్యూ పాయింట్‌లకు ప్రసిద్ధి. వర్షంతో తడిసిన పచ్చదనం, ఆర్థర్స్ సీట్, లింగ్మల జలపాతం ఆకర్షణీయంగా ఉంటాయి.
ఉదయపూర్, రాజస్థాన్
ఎడారి రాష్ట్రంలో రుతుపవనాల సమయంలో ఉదయపూర్ ప్రత్యేకమైన ఆకర్షణను సంతరించుకుంటుంది. పిచోలా సరస్సు, ఫతే సాగర్ నీరు నిండి అద్భుతంగా కనిపిస్తాయి. ఆరావళి కొండలు పచ్చగా మారి మనసును ఆకట్టుకుంటాయి. కొండచరియలు, వరదల భయం లేకుండా సురక్షితంగా ఆనందించవచ్చు.
వయనాడ్, కేరళ
కేరళ ఉత్తర కొండలలో ఉన్న వయనాడ్, వర్షాకాలంలో పొగమంచు, పచ్చదనంతో కప్పబడి ఉంటుంది. మీన్ముట్టి, సూచిపారా జలపాతాలు ఆహ్లాదకర అనుభూతిని అందిస్తాయి. తేయాకు తోటలు కొత్త తాజాదనంతో మెరిసిపోతాయి.
కూర్గ్, కర్ణాటక
‘స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా’గా పిలిచే కూర్గ్, సుగంధ ద్రవ్యాల తోటలతో మనోహరమైన వాసనలను వెదజల్లుతుంది. అబ్బే జలపాతం ఉప్పొంగుతూ ఆకట్టుకుంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను ఆనందపరుస్తాయి.
లోనావాలా, మహారాష్ట్ర
ముంబై-పుణే మధ్య ఉన్న ఈ ప్రాంతం వర్షాకాలంలో ప్రకృతి సౌందర్యంతో ఆకర్షిస్తుంది. పొగమంచుతో కప్పబడిన రాజ్‌మాచి కోట నుంచి భూషి ఆనకట్ట వరకు ప్రతిదీ అద్భుతంగా కనిపిస్తుంది.
గోవా
వర్షాకాలంలో గోవాకు వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపరు, కానీ ఈ సమయంలో గోవా పచ్చదనంతో అత్యంత అందంగా కనిపిస్తుంది. దూద్‌సాగర్ జలపాతం వంటివి అద్భుత దృశ్యాన్ని అందిస్తాయి.
లడఖ్, జమ్మూ & కాశ్మీర్
రుతుపవనాల సమయంలో లడఖ్‌లో వర్షాలు తక్కువగా ఉంటాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ, లడఖ్ ఎండలతో కనిపిస్తుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు పాంగోంగ్ సరస్సు, నుబ్రా వ్యాలీ, లేహ్‌ను సందర్శించడానికి పర్యాటకులు ఇష్టపడతారు.
మున్నార్, కేరళ
మున్నార్‌లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి, ఈ సమయంలో ఈ ప్రాంతం మరింత రమణీయంగా కనిపిస్తుంది. టీ ఎస్టేట్‌లు, జలపాతాల గర్జనలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
మౌంట్ అబు, రాజస్థాన్
రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబు, ఎడారి రాష్ట్రంలో చల్లని ఆశ్రయం. రుతుపవనాల సమయంలో నక్కీ సరస్సు పొగమంచుతో నిండి, దిల్వారా దేవాలయాలు అద్భుతంగా కనిపిస్తాయి.
షిల్లాంగ్, మేఘాలయ
‘తూర్పు స్కాట్లాండ్’గా పిలిచే షిల్లాంగ్, వర్షాకాలంలో ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటుంది. ఉప్పొంగే జలపాతాలు, మేఘాలతో కప్పబడిన లోయలు కనువిందు చేస్తాయి. ఎలిఫెంట్ ఫాల్స్, లైట్లమ్ కాన్యన్స్ ప్రత్యేక ఆకర్షణలు.

