Kitchenvantalu

Mushroom kabab: రెస్టారెంట్ స్టైల్ “మష్రూమ్ కబాబ్” ఇలా సులభంగా చేసేయండి..

Mushroom kabab:మష్రూమ్ కబాబ్ ఒక రుచికరమైన వెజిటేరియన్ వంటకం, ఇది మష్రూమ్‌లను మెరినేట్ చేసి, స్కీవర్స్‌పై కాల్చి లేదా వేయించి తయారు చేస్తారు. ఇది సులభంగా తయారు చేయగలిగిన, రుచిగల స్టార్టర్ లేదా సైడ్ డిష్.

కావాల్సిన పదార్థాలు:

– మష్రూమ్స్ – 1 కప్పు
– ఉప్పు – సరిపడా
– పసుపు – 1 టీస్పూన్
– ధనియాల పొడి – 1 టీస్పూన్
– అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
– మొజరెల్లా చీజ్ – 2 టేబుల్ స్పూన్లు
– స్వీట్ కార్న్ (ఉడికించినవి) – 2 టేబుల్ స్పూన్లు
– పెరుగు (లేదా యోగర్ట్) – 1 కప్పు
– గరం మసాలా – 1/2 టీస్పూన్
– మిరియాల పొడి – 1/2 టీస్పూన్
– పచ్చిమిర్చి – 1 (తరిగినది)
– శనగపిండి – 1 టేబుల్ స్పూన్
– నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
– కసూరీ మేథి – 1/4 టీస్పూన్
– కశ్మీరీ కారం – కొంచెం
– కొత్తిమీర – కొంచెం (తరిగినది)

తయారీ విధానం:
1. మష్రూమ్స్‌ను శుభ్రం చేసి, తొడిమలు వేరు చేయాలి. ఒక పాన్‌లో నీళ్లు పోసి, ఉప్పు, పసుపు వేసి మష్రూమ్స్‌ను ఉడికించాలి. ఉడికిన తర్వాత నీటిని వడకట్టి, మష్రూమ్స్‌ను టిష్యూ పేపర్‌తో తేమ లేకుండా తుడిచి ఆరబెట్టాలి.

2. ఒక గిన్నెలో పెరుగు, మొజరెల్లా చీజ్, స్వీట్ కార్న్ (రెండూ 2 టేబుల్ స్పూన్ల చొప్పున), తరిగిన పచ్చిమిర్చి, కసూరీ మేథి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్టఫింగ్‌గా ఉపయోగించాలి.

3. ఆరబెట్టిన మష్రూమ్స్‌లో ఈ స్టఫింగ్‌ను నింపి, రెండు మష్రూమ్స్ మధ్య స్టఫింగ్ ఉండేలా జత చేయాలి. ఈ జతగల మష్రూమ్స్‌ను కడ్డీలకు గుచ్చాలి.

4. మరో గిన్నెలో మిగిలిన పెరుగు, శనగపిండి, గరం మసాలా, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. అందులో నిమ్మరసం, మొజరెల్లా చీజ్ కలిపి మరోసారి కలపాలి.

5. ఈ మిశ్రమాన్ని కడ్డీలకు గుచ్చిన మష్రూమ్స్‌పై పట్టించాలి. తర్వాత వాటిని సన్నని మంట మీద కాల్చాలి.

6. అంతే! రుచికరమైన మష్రూమ్ కబాబ్‌లు సిద్ధం.