Pesara punugulu:బండి మీద అమ్మే “పెసర పునుగులు” ఇంట్లోనే టేస్టీ గా చేయండి
Pesara punugulu:బండి మీద అమ్మే “పెసర పునుగులు” ఇంట్లోనే టేస్టీ గా చేయండి.. వేడివేడిగా సాఫ్ట్‌గా ఉండే పెసర పునుగులు అల్లం చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ, కొందరు చేసినప్పుడు ఈ పునుగులు గట్టిగా వచ్చి తినడానికి ఇష్టం ఉండదు.
అయితే, ఈ కింది విధానంలో పెసర పునుగులు చేస్తే, అవి దూదిలా మెత్తగా వస్తాయి. పైగా, ఈ పునుగుల కోసం పొట్టు తీసిన పెసరపప్పు అవసరం లేదు. సాధారణ పెసరపప్పుతో సులభంగా తయారు చేయవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
– పెసరపప్పు – 1 కప్పు (సుమారు పావు కేజీ)
– ఉప్పు – రుచికి సరిపడా
– జీలకర్ర – 1 టీస్పూన్
– అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
– నూనె – డీప్ ఫ్రైకి తగినంత
– వంటసోడా – చిటికెడు
తయారీ విధానం:
1. ముందుగా, ఒక గిన్నెలో 1 కప్పు పెసరపప్పు తీసుకొని రెండు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత, తగినంత నీరు పోసి 2 గంటల పాటు నానబెట్టాలి.
2. నానిన తర్వాత, పప్పును చిల్లుల గిన్నెలోకి తీసుకొని నీరు పోయేలా 1 నిమిషం పక్కన పెట్టాలి.
3. ఇప్పుడు, నానిన పెసరపప్పును గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పిండి రుబ్బేటప్పుడు, గట్టిగా ఉండకుండా 1 టేబుల్ స్పూన్ నీరు జోడించి రుబ్బాలి.
4. మెత్తగా రుబ్బిన పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ పునుగుల కోసం గ్రైండర్‌లోనే పిండి రుబ్బాలి, మిక్సీలో రుబ్బితే పునుగులు గట్టిగా వస్తాయి.
5. పిండిలో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం-పచ్చిమిర్చి పేస్ట్, చిటికెడు వంటసోడా వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి.
6. స్టవ్ వెలిగించి, ఒక పాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
7. నూనె వేడయ్యాక, స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, పిండిని చేతితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న పునుగులుగా వేయాలి.
8. కడాయిలో తగినన్ని పునుగులు వేసిన తర్వాత, అవి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
9. పునుగులు దోరగా వేగిన తర్వాత, ప్లేట్లోకి తీసుకొని వేడిగా సర్వ్ చేయాలి.
ఈ క్రిస్పీ, టేస్టీ స్ట్రీట్ స్టైల్ పెసర పునుగులను అల్లం చట్నీ, టమాటో చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే, ఈ పునుగులతో పులుసు కూడా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా మెత్తగా, రుచిగా వస్తాయి!

