Alasandulu vankaaya curry:అమ్మమ్మలు,నానమ్మల కాలంనాటి “అలసందులు వంకాయ కూర”..ఒక్కసారి రుచి చూస్తే..
Alasandulu vankaaya curry:రాయలసీమ వంటలు అంటే గుమగుమలాడే కారపు సుగంధం, విశిష్టమైన రుచులు గుర్తుకొస్తాయి. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వంటకం వంకాయ అలసందల పులుసు. రాయలసీమలో ఇంటింటా తరచుగా తయారయ్యే ఈ సాంప్రదాయ వంటకం, వంకాయ మరియు అలసందల కలయికతో ప్రత్యేకమైన రుచిని సంతరించుకుంటుంది.
రుచితో పాటు, ఇది పోషక విలువలతో కూడా సమృద్ధం. తాజా వంకాయలు, అలసందలతో తయారయ్యే ఈ పులుసు వేడి అన్నం లేదా రాగి సంగటితో అద్భుతమైన కాంబినేషన్. రాయలసీమ స్పెషల్ వంకాయ అలసందల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ వివరంగా చూడండి.
కావలసిన పదార్థాలు
– వంకాయలు: 250 గ్రాములు
– అలసందలు: అర కప్పు
– చింతపండు: నిమ్మకాయంత
– ఉల్లిపాయ: 1
– పచ్చిమిర్చి: 3-4
– టమాటా: 1
– కరివేపాకు: 2 రెబ్బలు
– కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
– నూనె: 2 టేబుల్ స్పూన్లు
– ఆవాలు: అర టీ స్పూన్
– జీలకర్ర: అర టీ స్పూన్
– మెంతులు: పావు టీ స్పూన్
– ఇంగువ: చిటికెడు
– పసుపు: అర టీ స్పూన్
– కారం: 1 టీ స్పూన్
– ధనియాల పొడి: 1 టీ స్పూన్
– బెల్లం: చిన్న ముక్క
– ఉప్పు: రుచికి సరిపడా
– వేరుశెనగలు: 2 టేబుల్ స్పూన్లు
– నువ్వులు: 1 టేబుల్ స్పూన్
– ఎండుకొబ్బరి తురుము: 2 టేబుల్ స్పూన్లు
– ధనియాలు: 1 టీ స్పూన్
– జీలకర్ర: అర టీ స్పూన్
– గసగసాలు: 1 టీ స్పూన్
తయారీ విధానం
1. అలసందలను రాత్రంతా నీటిలో నానబెట్టి, శుభ్రంగా కడిగి తగినంత నీటితో మెత్తగా ఉడికించాలి. ఉడికిన తర్వాత నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
2. చింతపండును వేడి నీటిలో నానబెట్టి, మెత్తగా చేసి చిక్కటి గుజ్జు తీసి పక్కన ఉంచాలి.
3. స్టవ్‌పై పాన్ పెట్టి, వేరుశెనగలు, నువ్వులు, ఎండుకొబ్బరి తురుము, ధనియాలు, జీలకర్ర, గసగసాలను విడివిడిగా వేయించి చల్లార్చాలి. తర్వాత వీటిని మిక్సీలో కొద్దిగా నీటితో మెత్తగా పేస్ట్‌లా చేయాలి.
4. కడాయిలో నూనె వేసి వేడి చేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడనివ్వాలి.
5. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
6. అందులో వంకాయ ముక్కలు వేసి 2-3 నిమిషాలు వేయించి, ఆ తర్వాత టమాటా ముక్కలు, పసుపు వేసి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించాలి.
7. టమాటాలు మెత్తబడిన తర్వాత కారం, ధనియాల పొడి వేసి ఒక నిమిషం వేయించాలి.
8. ఉడికించిన అలసందలు, చింతపండు గుజ్జు, తగినంత నీరు వేసి బాగా కలపాలి. ఉప్పు, బెల్లం వేసి రుచి సరిచూసుకోవాలి.
9. సిద్ధం చేసిన మసాలా పేస్ట్ వేసి, మీడియం మంటపై 10-15 నిమిషాలు మరగనివ్వాలి.
10. పులుసు చిక్కబడి, నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీరతో అలంకరించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు రుచికరమైన రాయలసీమ స్పెషల్ వంకాయ అలసందల పులుసు సిద్ధం!

