Kitchenvantalu

Tomato Dosa Recipe:అప్పటికప్పుడు దోశ తినాలనిపిస్తుందా.. ఇలా “టమాటా దోశ” చేసుకోండి

Tomato Dosa Recipe:రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఇళ్లలో గానీ, హోటళ్లలో గానీ ప్రధానంగా తయారుచేసే వంటకం ఏదైనా ఉందంటే అది దోశే. దోశ తినని తెలుగువారు ఉండరు.

అయితే, రోజూ అదే మసాలా దోశలు, ఎగ్ దోశలు, ఉల్లిపాయ దోశలు తిని బోర్ కొట్టేసిందా? అయితే, టమాటో దోశను ఓసారి రుచి చూడాల్సిందే. దీని రుచిని మాటల్లో వర్ణించలేము. సాధారణంగా కడపతో సహా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈ దోశను ఎక్కువగా తయారు చేస్తారు.

ఈ టమాటో దోశను చాలా సులభంగా తక్షణమే తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ దోశ ఇష్టమవుతుంది. ఇంట్లో సులభంగా తయారు చేసుకోగలిగే టమాటో దోశ కోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.

టమాటో దోశకు కావలసిన పదార్థాలు
– టమాటోలు
– ఎండుమిర్చి
– ఉప్పు
– వెల్లుల్లి
– మినపగుళ్లు
– బియ్యం
– నీరు

**టమాటో దోశ తయారీ విధానం**

1. ఒక గిన్నెలో ¾ కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీరు పోసి 2 గంటలు నానబెట్టండి.

2. వేరే గిన్నెలో ½ కప్పు మినపగుళ్లను కడిగి, నీరు పోసి 2 గంటలు నానబెట్టండి.

3. 2 గంటల తర్వాత నానిన బియ్యం, మినపగుళ్లను మిక్సీ జార్‌లో వేసి, ఆ తర్వాత 8 ఎండుమిర్చి, 3 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 4-5 టమాటో ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి, నీరు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేయండి.

4. గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, గంటసేపు పక్కన పెట్టండి.

5. గంట తర్వాత పిండిలో కొద్దిగా నీరు పోసి, దోశ పిండి సాంద్రతకు కలపండి.

6. స్టవ్‌పై దోశ పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడయ్యాక, గరిటెతో పిండిని పోసి, సన్నగా పరచండి.

7. పిండి తడి ఆరిన తర్వాత, దోశపై కొద్దిగా నెయ్యి వేసి, బాగా కాల్చి, పెనం నుంచి తీసేయండి.

అంతే, టమాటో దోశ రెడీ! మీకు ఇష్టమైన చట్నీతో దీన్ని ఆస్వాదిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.