Bendakaya bajji kura:కేవలం 10 నిమిషాల్లో “బెండకాయ బజ్జి కూర” కుక్కర్ లో రుచిగా చేసేయండి.. రైస్, చపాతీలోకి బాగుంటుంది..
Bendakaya bajji kura:రాయలసీమలోని గ్రామాల్లో ప్రత్యేకంగా తయారుచేసే వంటకం బెండకాయ బజ్జీ. దీన్ని కొందరు పుల్లకూర లేదా ముద్దకూర అని కూడా పిలుస్తారు. తమిళనాడులోనూ ఈ వంటకాన్ని బజ్జీగా పిలుస్తారు. ఇది అద్భుతమైన రుచితో కూడిన కూర, ఒకసారి రుచి చూస్తే జీవితంలో మర్చిపోలేరు. ముఖ్యంగా రాగి సంగటి లేదా జొన్న సంగటితో కలిపి తింటే దీని రుచి అద్వితీయం. రాయలసీమ పల్లెల స్పెషల్ బెండకాయ బజ్జీని మీ ఇంట్లో ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకోండి.
రాయలసీమ స్పెషల్ బెండకాయ బజ్జీ తయారీకి కావలసిన పదార్థాలు
– బెండకాయలు
– ఉల్లిపాయలు
– పుల్లటి నాటు టమాటోలు
– పసుపు
– కల్లు ఉప్పు (లేదా సాధారణ ఉప్పు)
– చింతపండు
– పచ్చిమిర్చి
– ఎండుమిర్చి
– ఆవాలు
– కరివేపాకు
బెండకాయ బజ్జీ తయారీ విధానం
1. ముందుగా 300 గ్రాముల బెండకాయలను శుభ్రంగా కడిగి, ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టండి.
2. స్టవ్ మీద గిన్నె లేదా బాండీ పెట్టి, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి.
3. నూనె వేడయ్యాక, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వండి. వెల్లుల్లి రంగు మారుతున్నప్పుడు, రెండు ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి 1 నిమిషం వేగించండి.
4. తర్వాత రెండు పుల్లటి నాటు టమాటోల ముక్కలు, కొద్దిగా పసుపు, కల్లు ఉప్పు వేసి 3-4 నిమిషాలు వేగనివ్వండి. ఆ తర్వాత ఆరబెట్టిన బెండకాయ ముక్కలను వేసి, మూత పెట్టి హై ఫ్లేమ్‌లో బెండకాయల జిగురు తగ్గే వరకు (సుమారు 3-4 నిమిషాలు) వేగించండి.
5. ఇప్పుడు 8 పచ్చిమిర్చి ముక్కలు, 50 గ్రాముల చింతపండు వేసి కలిపి మరో 2 నిమిషాలు వేగనివ్వండి.
6. తర్వాత 300 ml నీళ్లు పోసి, మూత పెట్టి కూర గుజ్జుగా అయ్యే వరకు ఉడకనివ్వండి.
7. బెండకాయ మెత్తగా ఉడికిన తర్వాత, స్టవ్ మీద నుంచి తీసి పప్పు గుత్తితో గుజ్జుగా ఇనుపుకోండి. ఇనిపేటప్పుడు కూర కాస్త నీరు నీరుగా ఉండేలా చూసుకోండి.
8. తాళింపు కోసం ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, అందులో అర టీస్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి వేగించి, ఈ తాళింపును బెండకాయ గుజ్జులో వేసి కలపండి.
అంతే! రాయలసీమ స్పెషల్ బెండకాయ బజ్జీ (పుల్లకూర) రెడీ. రాగి సంగటి లేదా జొన్న సంగటితో సర్వ్ చేసి ఆస్వాదించండి!

