Kitchenvantalu

Drumstick Dal :హై ప్రోటీన్,ఇమ్యూనిటీ పెంచే “మునక్కాయ పప్పు” ఓసారి చేసి చూడండి

Drumstick Dal :హై ప్రోటీన్,ఇమ్యూనిటీ పెంచే “మునక్కాయ పప్పు” ఓసారి చేసి చూడండి.. చాలా మందికి మునగాకు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసు. ఆయుర్వేదంలో మునగాకును వివిధ రోగాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. మునగాకు ఎన్ని ప్రయోజనాలను అందిస్తుందో, మునక్కాయలు కూడా అన్ని ప్రయోజనాలను అందిస్తాయి. మునక్కాయల రుచి కూడా చాలా బాగుంటుంది.

వీటిని సాధారణంగా సాంబార్‌లో వేసుకుని తింటాం. అయితే, మునక్కాయలతో రుచికరమైన పప్పు కూడా తయారు చేసుకోవచ్చు. మునక్కాయలతో చేసే పప్పు రుచిగా ఉండడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు మునక్కాయ పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం.

మునక్కాయ పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు:
కందిపప్పు – 100 గ్రాములు
చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ¼ కప్పు
తరిగిన టమాట ముక్కలు – ½ కప్పు
తరిగిన పచ్చిమిర్చి ముక్కలు – ¼ కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – ½ టీస్పూన్
కారం – 1 టీస్పూన్
చింతపండు – కొద్దిగా
నీళ్లు – సరిపడా

తాళింపు కోసం కావాల్సిన పదార్థాలు:
మునక్కాయ ముక్కలు – 1 కప్పు
జీలకర్ర – 1 టీస్పూన్
ఆవాలు – 1 టీస్పూన్
పచ్చి శనగపప్పు – 1 టీస్పూన్
ఎండుమిరపకాయలు – 2
వెల్లుల్లి – 5 రెబ్బలు
కరివేపాకు – 1 రెమ్మ
ఇంగువ – ¼ టీస్పూన్
నూనె – 2 టీస్పూన్లు
కొత్తిమీర – కొద్దిగా

మునక్కాయ పప్పు తయారు చేసే విధానం:
ముందుగా చింతపండును నీటిలో బాగా నానబెట్టి, రసం తీసి పక్కన పెట్టుకోవాలి.కందిపప్పును శుభ్రంగా కడిగి, కుక్కర్‌లో వేసి, దానితో పాటు తరిగిన ఉల్లిపాయ, టమాట, పచ్చిమిర్చి ముక్కలు వేసి, సరిపడా నీళ్లు పోసి, మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

ఉడికిన పప్పులో చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి.ఒక కళాయిలో 2 టీస్పూన్ల నూనె వేసి, కాగిన తర్వాత మునక్కాయ ముక్కలను వేసి బాగా వేయించి, పక్కన పెట్టుకోవాలి.

అదే కళాయిలో మరికొంత నూనె వేసి, కొత్తిమీర మినహా మిగిలిన తాళింపు పదార్థాలను వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత, వీటిని ఉడికిన పప్పులో వేసి బాగా కలపాలి.

తాళింపు వేసిన పప్పుపై మూత పెట్టి, మరో 10 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించి, చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ విధంగా తయారు చేసిన మునక్కాయ పప్పు సుగంధంతో పాటు అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.

మునగాకు, మునక్కాయల ప్రయోజనాలు:
మునగాకు, మునక్కాయలు తినడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. ఇవి షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. ఇందులోని విటమిన్లు చర్మ సంరక్షణలో ఉపయోగపడతాయి. మునక్కాయలతో చేసిన పప్పు రుచికరంగా ఉండడమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.