Kakarakaya Ulli Karam :ఎప్పటిలా కాకుండా కాకరకాయ ఉల్లి కారం ఈ సారి ఇలా చేయండి అదిరిపోద్ది
Kakarakaya Ulli Karam :ఎప్పటిలా కాకుండా కాకరకాయ ఉల్లి కారం ఈ సారి ఇలా చేయండి అదిరిపోద్ది.. కాకరకాయలు చేదుగా ఉండటం వల్ల చాలామంది వీటిని తినడానికి ఇష్టపడరు. అయినప్పటికీ, కాకరకాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో, బరువు తగ్గడంలో సహాయపడతాయి.
అలాగే, కాకరకాయలలో బి కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే, కాకరకాయలను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం మంచిది. కాకరకాయలతో ఉల్లికారం తయారు చేస్తే, చేదు లేకుండా రుచిగా తినవచ్చు. ఈ కాకరకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు:
చిన్న కాకరకాయలు – అర కిలో
పెద్దగా తరిగిన ఉల్లిపాయలు – 2 కప్పులు
కారం – రుచికి సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 4 టీస్పూన్లు
పసుపు – 1 టీస్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
ఆవాలు – 1 టీస్పూన్
కరివేపాకు – 1 రెబ్బ
ధనియాలు – 1 టీస్పూన్
ఎండుమిర్చి – 2
కాకరకాయ ఉల్లికారం తయారీ విధానం:
ముందుగా కాకరకాయల చెక్కును తొలగించి, శుభ్రంగా కడిగి, చాకుతో ఒకవైపు పొడవుగా గాటు పెట్టుకోవాలి.ఒక గిన్నెలో నీటిని పోసి, కాకరకాయలను వేసి ఉడికించాలి. ఇలా చేయడం వల్ల చేదు తగ్గుతుంది.
ఒక జార్‌లో తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, కారం వేసి మెత్తగా మిక్సీలో రుబ్బుకోవాలి.ఒక కళాయిలో నూనె వేసి, కాగిన తర్వాత ఉడికించిన కాకరకాయలను వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే కళాయిలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, ధనియాలు వేసి వేయించాలి.ఇవి వేగిన తర్వాత, మిక్సీలో రుబ్బిన ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి, 5 నిమిషాలు ఉడికించాలి.ఆపై, వేయించిన కాకరకాయలను వేసి, ఉల్లిపాయ మిశ్రమం కాకరకాయలలోకి ఇంకేలా బాగా కలపాలి.
మరో 5 నిమిషాలు వేయించి, స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ విధంగా తయారు చేసిన కాకరకాయ ఉల్లికారం చేదు లేకుండా రుచిగా ఉంటుంది. అంతేకాక, కాకరకాయలలోని పోషకాలు శరీరానికి అందుతాయి.

