Wheat Rava Khichadi: హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. గోధుమ రవ్వతో “కిచిడి” ఎలా తయారు చేసుకోవాలో తెలుసా.. ఎంత బాగుంటుందో!
Wheat Rava Khichadi: హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. గోధుమ రవ్వతో “కిచిడి” ఎలా తయారు చేసుకోవాలో తెలుసా.. ఎంత బాగుంటుందో.. గోధుమలతో చాలా మంది చపాతీలు తయారు చేసి తింటారు. అయితే, ఎప్పుడూ చపాతీలే కాకుండా వైవిధ్యమైన వంటకాలను కోరుకునేవారు గోధుమ రవ్వతో కూడా రుచికరమైన వంటలు తయారు చేయవచ్చు.
ఈ రవ్వతో చేసే ఏ వంటకమైనా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా, గోధుమ రవ్వతో కిచిడీ తయారు చేస్తే అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ కిచిడీని ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం లేదా రాత్రి భోజనంగా ఎప్పుడైనా తినవచ్చు. ఇది త్వరగా కడుపు నింపి, ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. అంతేకాక, బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇప్పుడు గోధుమ రవ్వ కిచిడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
గోధుమ రవ్వ కిచిడీకి కావలసిన పదార్థాలు:
గోధుమ రవ్వ – 1½ కప్పు
పెసరపప్పు – ¼ కప్పు
అల్లం తరుగు – ½ టీస్పూన్
లవంగాలు – 2
బిర్యానీ ఆకు – 1
యాలకులు – 2
ఎండు మిర్చి – 2
పచ్చి మిర్చి – 2
నెయ్యి – ¼ కప్పు
ఆవాలు – 1 టీస్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు
ఉల్లిపాయ – 1 (తరిగినది)
టమాటా – 1 (తరిగినది)
పచ్చి బఠానీ – ½ కప్పు
క్యారెట్ – 1 (తరిగినది)
బంగాళాదుంప – 2 (తరిగినవి)
బీన్స్ – 5 (తరిగినవి)
ఉప్పు – తగినంత
పసుపు – ½ టీస్పూన్
కారం – ¼ టీస్పూన్
తయారీ విధానం:
కుక్కర్‌ను స్టవ్‌పై ఉంచి, నెయ్యి వేసి కాగనివ్వాలి.నెయ్యి వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు వేసి వేగించాలి. ఒక నిమిషం తర్వాత, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి.తర్వాత, తరిగిన కూరగాయలన్నీ (ఉల్లిపాయ, టమాటా, బఠానీ, క్యారెట్, బంగాళాదుంప, బీన్స్) వేసి బాగా వేగనివ్వాలి.
ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి.4½ కప్పుల నీళ్లు పోసి, పెసరపప్పు, గోధుమ రవ్వ వేసి, కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి.వడ్డించే ముందు కొద్దిగా నెయ్యి చల్లితే, వేడి వేడి గోధుమ రవ్వ కిచిడీ సిద్ధం!
సూచన: ఈ కిచిడీని తాజాగా, వేడిగా తినడం వల్ల రుచి మరియు పోషక విలువలు బాగా లభిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

