Kitchenvantalu

Tomato Kothimeera Pachadi:” కొత్తిమీర టొమాటో పచ్చడి” ఇలా చేసి చూడండి.. అన్నం, టిఫిన్స్ లోకి బావుంటుంది

Tomato Kothimeera Pachadi:” కొత్తిమీర టొమాటో పచ్చడి” ఇలా చేసి చూడండి.. అన్నం, టిఫిన్స్ లోకి బావుంటుంది.. బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా మనం తయారు చేసే దోసె, ఇడ్లీలతో పాటు రకరకాల చట్నీలు, పచ్చళ్లను తయారు చేస్తుంటాం. అందులో అప్పటికప్పుడు తయారు చేసే టమాటా పచ్చడి ఒకటి.

ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇందులో కొత్తిమీరను కలిపి మరింత రుచికరంగా తయారు చేయవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పచ్చడితో దోసె, ఇడ్లీలను ఆస్వాదించవచ్చు. ఇప్పుడు టమాటా కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.

టమాటా కొత్తిమీర పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు:
టమాటా ముక్కలు – ¾ కప్పు
తరిగిన కొత్తిమీర – 1 కప్పు
పల్లీలు – 2 నుండి 3 టీస్పూన్లు
పచ్చిమిర్చి – 10
నూనె – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – ½ టీస్పూన్
చింతపండు – 20 గ్రాములు
అల్లం ముక్కలు – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 6 లేదా 7
ఉప్పు – రుచికి సరిపడా

తాళింపు కోసం కావాల్సిన పదార్థాలు:
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – ½ టీస్పూన్
జీలకర్ర – ¼ టీస్పూన్
ఎండుమిర్చి ముక్కలు – 2 లేదా 3
కరివేపాకు – 1 రెమ్మ
ఇంగువ – ¼ టీస్పూన్

టమాటా కొత్తిమీర పచ్చడి తయారీ విధానం:
ముందుగా ఒక కళాయిలో పల్లీలను వేసి బాగా వేయించి, ఒక ప్లేటులోకి తీసి పక్కన పెట్టుకోవాలి.అదే కళాయిలో నూనె వేసి, వేడి అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసి వేయించాలి. వేగిన తర్వాత వీటిని కూడా ప్లేటులోకి తీసి పక్కన ఉంచాలి.

ఇప్పుడు అదే నూనెలో టమాటా ముక్కలను వేసి, మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి.2 నిమిషాల తర్వాత తరిగిన కొత్తిమీర, చింతపండును వేసి బాగా కలిపి, మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి పూర్తిగా ఉడకనవసరం లేదు.

ఉడికించిన టమాటా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.ఒక మిక్సీ జార్‌లో వేయించిన పల్లీలు, పచ్చిమిర్చిని వేసి, మెత్తగా కాకుండా కొద్దిగా గరుకుగా ఉండేలా గ్రైండ్ చేయాలి.ఆ తర్వాత చల్లారిన టమాటా-కొత్తిమీర మిశ్రమం, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి, మెత్తగా కాకుండా కొద్దిగా గరుకుగా గ్రైండ్ చేయాలి.

గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేసి, తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేయాలి. ఈ తాళింపును పచ్చడిలో వేసి కలపాలి.