Tandoori Tea:ఆహా ఏమి రుచి అనిపించే “తందూరీ టీ”.. ఇలా ఈజీగా చేసేయండి..
Tandoori Tea:ఆహా ఏమి రుచి అనిపించే “తందూరీ టీ”.. ఇలా ఈజీగా చేసేయండి.. మనం ఇంట్లో రోజూ కాఫీ, టీలను తయారు చేసి తాగుతుంటాం. బయటకు వెళితే వివిధ రకాల కాఫీ, టీలు అందుబాటులో ఉంటాయి. అందులో మట్టి ముంతల్లో సర్వ్ చేసే తందూరీ టీని చాలా మంది రుచి చూసి ఉంటారు. ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. అయితే, ఈ తందూరీ టీని మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
నీళ్లు – 2 కప్పులు
టీ పొడి – 2 టీస్పూన్లు
యాలకులు – 4
అల్లం ముక్క – చిన్నది (తరిగినది)
చక్కెర – 3 టీస్పూన్లు
పాలు – 1 కప్పు
తందూరీ టీ తయారీ విధానం:
స్టవ్‌ను వెలిగించి, ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి మరిగించండి.నీళ్లు మరుగుతున్నప్పుడు, కచ్చాపచ్చాగా దంచిన 4 యాలకులు, తరిగిన అల్లం ముక్కను వేసి 2 నిమిషాలు మరిగించండి.
అందులో 2 టీస్పూన్ల టీ పొడిని వేసి కలపండి.టీ మరుగుతున్న సమయంలో 1 కప్పు పాలు జోడించండి.ఒక పొంగు వచ్చిన తర్వాత, స్టవ్‌ను చిన్న మంటకు మార్చి, 3 టీస్పూన్ల చక్కెర వేసి బాగా కలపండి.
2-3 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించి, టీని వడకట్టి ఒక పాత్రలోకి తీసుకోండి.మరో పొయ్యిపై ఒక చిన్న జాలీని ఉంచి, దానిపై బొగ్గులను వేడి చేయండి. బొగ్గులు లేకపోతే, మట్టి ముంతను నేరుగా స్టవ్‌పై ఉంచి కాల్చవచ్చు.ఇప్పుడు కాల్చిన ఈ వేడి మట్టి ముంతలో వడకట్టిన టీని పోసి సర్వ్ చేయండి.
ఈ విధంగా తయారు చేసిన తందూరీ టీ అద్భుతమైన రుచిని ఇస్తుంది. బయట తాగే తందూరీ టీ లాంటి రుచినే మీరు ఇంట్లోనే సులభంగా ఆస్వాదించవచ్చు.

