Kandi Pachadi:అమ్మమ్మ చేసే “కందిపచ్చడి”..వేడి వేడి అన్నంలోకి కాసింత నెయ్యి వేసి తింటే ఉంటుంది
Kandi Pachadi:అమ్మమ్మ చేసే “కందిపచ్చడి”..వేడి వేడి అన్నంలోకి కాసింత నెయ్యి వేసి తింటే ఉంటుంది.. మనం వంటింట్లో తరచూ కంది పప్పుతో పప్పు కూరలు తయారు చేస్తుంటాం. కంది పప్పు మన శరీరానికి ఎంతో ప్రయోజనకరం. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, ముఖ్యంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, బి విటమిన్లు అధికంగా లభిస్తాయి.
బరువు తగ్గడంలో, రక్తపోటు, షుగర్‌ను నియంత్రించడంలో కూడా కంది పప్పు సహాయపడుతుంది. కంది పప్పును వివిధ కూరగాయలతో కలిపి పప్పు కూరలు తయారు చేస్తాం. అలాగే, కంది పప్పుతో రుచికరమైన పచ్చడిని కూడా తయారు చేస్తారు. ఈ కంది పప్పు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ రుచికరమైన కంది పప్పు పచ్చడిని ఎలా తయారు చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కంది పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు:
కంది పప్పు – 3 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు – 10
జీలకర్ర – అర టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు – 6
తరిగిన ఉల్లిపాయ – 1
నానబెట్టిన చింతపండు – 15 గ్రాములు
నూనె – 1 టీస్పూన్
కరివేపాకు – 1 రెబ్బ
కంది పచ్చడి తయారీ విధానం:
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి, అది వేడి అయ్యాక కంది పప్పును వేసి ఎర్రగా వేయించుకోవాలి. వేయించిన కంది పప్పును ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.అదే కళాయిలో ఎండు మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాలి. ఎండు మిరపకాయలను ఎక్కువగా వేయించకూడదు.
ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించిన ఎండు మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా మెత్తగా రుబ్బుకోవాలి.తర్వాత వేయించి పెట్టుకున్న కంది పప్పును జోడించి, బరకగా ఉండేలా మిక్సీలో రుబ్బుకోవాలి.ఆ తర్వాత చింతపండు, చింతపండు నానిన నీళ్లను కూడా జార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
చివరగా, కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయలు కచ్చా పచ్చాగా ఉండేలా తేలిగ్గా మిక్సీలో రుబ్బుకోవాలి.ఇలా చేస్తే ఎంతో రుచికరమైన కంది పప్పు పచ్చడి సిద్ధమవుతుంది. ఈ పచ్చడిని తాళింపు చేసుకోవచ్చు. నిల్వ చేయాలనుకునే వారు వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలను అప్పటికప్పుడు మాత్రమే కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో కంది పచ్చడిని నెయ్యితో కలిపి తింటే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు.

