Kitchenvantalu

kakinada chitti pesarattlu:కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు హోటల్ స్టైల్ లో ఇంట్లోనే చేసేయండి..

kakinada chitti pesarattlu:కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు హోటల్ స్టైల్ లో ఇంట్లోనే చేసేయండి.. ఉదయం వర్షం కురుస్తుంటే, వేడి వేడి పెసరట్టు, అల్లం చట్నీతో తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. చాలా మందికి పెసరట్టు అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా కాకినాడ పెసరట్టు గురించి చెప్పాలంటే, దాని రుచి అదిరిపోతుంది. ఇంట్లోనే సులభంగా, రుచికరమైన కాకినాడ పెసరట్టు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఉదయం లేవగానే, అమ్మలు ఈ రోజు ఏ టిఫిన్ చేయాలి, కుటుంబానికి కొత్త రుచిని ఎలా పరిచయం చేయాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికోసం కాకినాడ పెసరట్టు రుచిని పరిచయం చేద్దాం. ఇప్పుడు నోరూరించే కాకినాడ స్పెషల్ పెసరట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం.

కాకినాడ స్పెషల్ పెసరట్టు కోసం కావాల్సిన పదార్థాలు:
పొట్టుతో ఉన్న పెసరపప్పు – 1 కప్పు
బియ్యం – 1½ టేబుల్ స్పూన్లు
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
రుచికి సరిపడా ఉప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు

తయారీ విధానం:
ముందు రోజు రాత్రి, ఒక గిన్నెలో 1 కప్పు పొట్టుతో ఉన్న పెసరపప్పు తీసుకొని, 2-3 సార్లు శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్లు పోసి నానబెట్టండి.మరో గిన్నెలో బియ్యం, మినపప్పు వేసి నీళ్లు పోసి నానబెట్టండి.

మరుసటి రోజు, నానబెట్టిన పెసరపప్పు నీళ్లను వంపేసి, శుభ్రంగా కడిగి, 4 టేబుల్ స్పూన్ల పెసరపప్పును పక్కన పెట్టండి.మిక్సీ జార్‌లో నానబెట్టిన పెసరపప్పు, రుచికి సరిపడా ఉప్పు, ¼ టీ స్పూన్ పసుపు, తగినంత నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.

అదే విధంగా, బియ్యం, మినపప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసి, రెండు మిశ్రమాలను ఒకదానితో ఒకటి కలపండి.స్టవ్ ఆన్ చేసి, దోసె పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడయ్యాక, మంటను కాస్త తగ్గించి, గరిటెతో పిండి తీసుకొని చిన్న చిన్న పెసరట్టులు వేయండి. ఈ పెసరట్టు కాస్త మందంగా ఉంటుంది.

పెసరట్టు పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు, 1 టీ స్పూన్ ధనియాల కారం చల్లి, గరిటెతో సమానంగా స్ప్రెడ్ చేయండి. రెండు వైపులా మంచిగా కాల్చండి.

అంతే! సింపుల్‌గా, రుచికరమైన కాకినాడ స్పెషల్ పెసరట్టు రెడీ. దీన్ని అల్లం చట్నీ లేదా పల్లీ చట్నీతో సర్వ్ చేస్తే, ఆ రుచికి మీరు మైమరచిపోతారు. ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే ఈ రెసిపీ ట్రై చేసి, కాకినాడ పెసరట్టు రుచిని ఆస్వాదించండి!