Vellulli Kobbari Karam:ఏమి తినబుద్ది కానప్పుడు ఇలా “వెల్లుల్లి కొబ్బరి కారం” ఒకసారి రుచి చూస్తే వదలరు
Vellulli Kobbari Karam:ఏమి తినబుద్ది కానప్పుడు ఇలా “వెల్లుల్లి కొబ్బరి కారం” ఒకసారి రుచి చూస్తే వదలరు… మనం వంటింట్లో కూరలు, పచ్చళ్లతో పాటు వివిధ రకాల కారం పొడులను కూడా తయారు చేస్తుంటాం. అలాంటి వాటిలో ఒకటి వెల్లుల్లి కొబ్బరి కారం. ఈ కారం రుచికరంగా ఉండడమే కాక, దీని తయారీలో ఉపయోగించే వెల్లుల్లి, ఎండు కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

వెల్లుల్లిని ఆహారంలో తరచూ చేర్చుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, రక్తం పలుచగా మారడంతో పాటు చెడు కొవ్వు (LDL) స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కూడా వెల్లుల్లి సహాయపడుతుంది. అదేవిధంగా, ఈ కారంలో ఉపయోగించే ఎండు కొబ్బరి కూడా గుండె, మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టు పెరుగుదలకు, పురుషులలో సంతాన సమస్యలను తగ్గించడంలో ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇప్పుడు వెల్లుల్లి కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం.

వెల్లుల్లి కొబ్బరి కారం తయారీకి కావలసిన పదార్థాలు:
ఎండు కొబ్బరి ముక్కలు – 1 కప్పు
కారం పొడి – 3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి పాయ (పెద్దది) – 1
ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి, వాటిని కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలను వేసి మెత్తని పొడిగా చేయాలి.తరువాత ఆ పొడిలో కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, రుబ్బిన వెల్లుల్లి రెబ్బలను వేసి కొద్దిగా మిక్సీలో గ్రైండ్ చేయాలి.
ఇలా చేస్తే రుచికరమైన వెల్లుల్లి కొబ్బరి కారం సిద్ధమవుతుంది.ఈ కారం 10 నుండి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్లో నిల్వ చేస్తే 2 నెలల వరకు తాజాగా ఉంటుంది. కావాలంటే ఈ కారంలో జీలకర్ర కూడా చేర్చవచ్చు.
సర్వింగ్ సూచనలు:
ఈ కారం పొడిని వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే అద్భుతమైన రుచి వస్తుంది. ఇడ్లీ, దోస, పెసరట్టు, ఉప్మా వంటి అల్పాహారాలతో కూడా ఈ కారం బాగుంటుంది. ఇది రుచితో పాటు పోషకాలను, ఆరోగ్యాన్ని అందిస్తుంది.

