Kitchenvantalu

Sweet Corn Samosa:”స్వీట్ కార్న్ సమోసా” ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ లో చేసుకోండి

Sweet Corn Samosa:”స్వీట్ కార్న్ సమోసా” ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ లో చేసుకోండి.. మనలో చాలామంది సమోసాలను ఇష్టపడతాం. దాదాపు అందరూ వీటిని రుచిగా తింటారని చెప్పడం అతిశయోక్తి కాదు. మార్కెట్‌లో వివిధ రుచులతో సమోసాలు లభిస్తాయి,

అందులో స్వీట్ కార్న్ సమోసా ఒకటి. ఈ సమోసా చాలా రుచికరంగా ఉంటుంది. ఇంట్లో కూడా సులభంగా, కరకరలాడే విధంగా స్వీట్ కార్న్ సమోసాలను తయారు చేసుకోవచ్చు. ఈ రుచికరమైన సమోసాల తయారీకి కావాల్సిన పదార్థాలు మరియు విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ కార్న్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు:
మైదా పిండి – 2 కప్పులు
స్వీట్ కార్న్ గింజలు – 1½ కప్పు
ఉప్పు – తగినంత
చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు
చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2
పసుపు – కొద్దిగా
కారం – రుచికి సరిపడా
గరం మసాలా – ¼ టీ స్పూన్
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
నీళ్లు – తగినంత

స్వీట్ కార్న్ సమోసా తయారీ విధానం:
ఒక గిన్నెలో మైదా పిండి, చిటికెడు ఉప్పు, 2 టీ స్పూన్ల నూనె వేసి, తగినంత నీళ్లు పోసి మెత్తగా లేదా గట్టిగా కాకుండా మధ్యస్థంగా పిండిని కలుపుకోవాలి. పిండిని కలిపిన తర్వాత మూతపెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచాలి.

పిండిని మళ్లీ ఒకసారి కలిపి ముద్దలుగా చేసి, పొడి మైదా సహాయంతో సన్నగా చపాతీలా చేసుకోవాలి. సన్నగా చేయడం వల్ల సమోసాలు కరకరలాడుతాయి.చపాతీలను పెనంపై చిన్న మంటలో ఒక నిమిషం రెండు వైపులా స్వల్పంగా కాల్చి, దీర్ఘచతురస్రాకారంలో పట్టీలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్ గింజలు, తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా మైదా పిండి, నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి.

కట్ చేసిన చపాతీ పట్టీలను తీసుకుని సమోసా ఆకారంలో చుట్టి, లోపల స్వీట్ కార్న్ మిశ్రమాన్ని నింపి, అంచులకు మైదా పేస్ట్ రాసి మూసివేయాలి.కళాయిలో నూనె పోసి, మధ్యస్థ మంటపై కాగిన తర్వాత సమోసాలను వేసి ఎర్రగా వేయించుకోవాలి.

ఇలా తయారు చేసిన స్వీట్ కార్న్ సమోసాలు కరకరలాడుతూ, రుచికరంగా ఉంటాయి. వీటిని నేరుగా లేదా పల్లి చట్నీతో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటాయి.