cooking tips:ఈ చిట్కాలను పాటిస్తే.. వంట త్వరగా, సులభంగా పూర్తవుతుంది..!
cooking tips:ఈ చిట్కాలను పాటిస్తే.. వంట త్వరగా, సులభంగా పూర్తవుతుంది..శీతాకాలంలో చల్లటి వాతావరణం వల్ల బద్ధకం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఉదయం మంచం మీద నుంచి లేవాలనిపించదు. ఆలస్యంగా నిద్ర లేస్తే, ఆ రోజు పనులన్నీ హడావిడిగా మారతాయి. ఈ రోజుల్లో చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు.

వీరు కొంచెం ఆలస్యంగా లేసినా, ఆఫీసుకు వెళ్లడం, పిల్లల లంచ్ బాక్స్‌లు సిద్ధం చేయడం, వారిని స్కూలుకు పంపడం ఆలస్యమవుతుంది. చలికాలంలో ఉదయం వంట పనులు మొదలుపెట్టడం కొంచెం కష్టమే. కానీ, కొన్ని చిన్న టిప్స్, ట్రిక్స్ పాటిస్తే, ఆలస్యంగా లేచినా వంట పని త్వరగా పూర్తవుతుంది. అవేంటో తెలుసుకోవడానికి ఈ స్టోరీ చదవండి.

ముందు రోజు రాత్రే మెనూ నిర్ణయించండి
రేపు ఉదయం ఏ వంట చేయాలో ముందు రోజు రాత్రే ప్లాన్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. ఉదయం హడావిడిలో నిర్ణయం తీసుకోవడం వల్ల కలిగే తొందరపాటు తప్పుతుంది. ఏం వండాలనే గందరగోళంలో మిగిలిన పనులు కూడా ఆలస్యమవుతాయి. కాబట్టి, రేపటి మెనూ ఈ రోజే డిసైడ్ చేయండి.

గుడ్లు ఉడికించడం సులభంగా
చాలా మంది ఉదయం ఉడికించిన గుడ్డు తినే అలవాటు కలిగి ఉంటారు. కొన్నిసార్లు గుడ్డు పెంకులు సరిగ్గా తొలగవు, దీనివల్ల సమయం వృథా అవుతుంది. గుడ్డు ఉడికించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా లేదా వెనిగర్ వేస్తే, పెంకులు సులభంగా వస్తాయి. ఇలా చేస్తే మీ సమయం ఆదా అవుతుంది.

ఆకుకూరలు ముందుగానే సిద్ధం చేయండి
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వారానికి కనీసం రెండుసార్లు ఆకుకూరలు వండుకుంటాం. ఉదయం హడావిడిలో ఆకుకూరలు కట్ చేయడం వల్ల చాలా సమయం వృథా అవుతుంది. ముందు రోజు రాత్రే ఆకుకూరలను కట్ చేసి, ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. ఉదయం త్వరగా వండుకోవచ్చు.

వెల్లుల్లి, ఉల్లిపొట్టు సులభంగా తొలగించడం
వెల్లుల్లి, ఉల్లిపొట్టు తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది. వీటిని వేడి నీటిలో కొద్దిసేపు ఉంచి, ఆ తర్వాత పొట్టు తీస్తే సులభంగా వస్తుంది. ఇలా చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది.

కూరగాయలు, పదార్థాలను ముందుగా సిద్ధం చేయండి
కొన్ని కూరగాయలు, పదార్థాలను ముందుగానే సిద్ధం చేసుకుంటే వంట సమయం ఆదా అవుతుంది. పచ్చిమిర్చి, ఎండుమిర్చి తొడిమలు తీసి ఉంచడం, చింతపండు గుజ్జుగా చేసి స్టోర్ చేయడం, చట్నీల కోసం పల్లీలను వేయించి పొడి చేసి పెట్టుకోవడం వంటివి చేయండి.

అల్లం-వెల్లుల్లి పేస్ట్, మసాలాలు సిద్ధంగా ఉంచండి
కూరల్లో అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాలు ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇవి ముందుగానే తయారు చేసి స్టోర్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది.

బంగాళదుంపల తొక్క సులభంగా తొలగించడం
ఉడికించిన బంగాళదుంపల తొక్క తీయడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, దీనివల్ల సమయం వృథా అవుతుంది. బంగాళదుంపలను ఉడికించే ముందు ఫోర్క్‌తో గీతలు పెట్టండి. ఇలా చేస్తే తొక్క సులభంగా వస్తుంది.

పాలు పొంగకుండా కాయడం
పాలు కాచేటప్పుడు పొంగిపోతాయనే భయంతో గిన్నె ఎదురుగా నిలబడతాం, దీనివల్ల సమయం వృథా అవుతుంది. దీన్ని నివారించడానికి, పాల గిన్నెపై చెక్క గరిటె ఉంచండి. ఇలా చేస్తే పాలు పొంగవు, మీ సమయం ఆదా అవుతుంది.

