Movies

మనం ట్విట్టర్‌ లో వీళ్ళని ఫాలో అవుతుంటాం, కానీ వీళ్ళు ఎవరిని ఫాలో అవుతారో తెలుసా?

నేటి యువత ప్రతి క్షణం వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్స్ తో గడిపేస్తున్నారు. ఏది జరిగిన నిమిషాల్లో షేర్ చేసేస్తూ ఉన్నారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ హవా ఉండటంతో అందరి చేతిలోనూ దాదాపుగా ఈ స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. దాంతో సోషల్ మీడియా వాడకం కూడా బాగా పెరిగిపోయింది. ఇక ట్విట్టర్ విషయానికొస్తే.. ట్విట్టర్ యూజర్స్ ట్వీట్లు అనబడే చిన్న చిన్న సందేశాలను పంపవచ్చు, చదువుకోవచ్చు. ట్విట్టర్ యూజర్స్ సందేశాలను కూడా పోస్టు చేయవచ్చు, చదవవచ్చు. ట్విట్టర్ లో అకౌంట్ లేనివారు సందేశాలను కేవలం చదువుకోవడానికే వీలుంటుంది. ఇక అసలు విషయానికొస్తే..మనం ట్విట్టర్‌ లో మనకు ఇష్టమైన స్టార్ హీరోస్ నో లేక ఫేమస్ పర్సన్స్ నో ఫాలో అవుతుంటాం, కానీ మన స్టార్ హీరోస్ ఎవరిని ఫాలో అవుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నాగార్జున
అక్కినేని నాగార్జున మనదేశ ప్రధాని నరేంద్రమోదీ అనుచరుడు! అయితే… ఆయన రాజకీయాల్లో అనుచరుడు కాదు. ట్విట్టర్‌లో మాత్రమే! ట్విట్టర్‌లో నాగార్జున ఫాలో అవుతున్న ఏకైక సెలబ్రిటీ మోదీ ఒక్కరే! చలనచిత్ర ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులతో కలిపి సుమారు ఐదు లక్షలమంది నాగార్జునను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు.

ఆయన మోదీని తప్ప ఎవర్నీ ఫాలో కావడం లేదు. తనయులు నాగచైతన్య, అఖిల్‌, కోడలు సమంత, ఇతర కుటుంబ సభ్యులతో సహా అందరూ ఆయన్ను ఫాలో కావాల్సిందే.

మహేష్ బాబు
తండ్రి కృష్ణ అడుగుజాడలను అనుసరిస్తూ చిత్రసీమలోకి అడుగులు వేసిన మహేష్ బాబు ట్విట్టర్‌ లో ఎవర్ని అనుసరిస్తారో తెలుసా? గల్లా జయదేవ్‌ ఒక్కర్నే! ఆయనెవరు? అనుకుంటున్నారా! టీడీపీ ఎంపీ, మహేశ్‌బాబుకు పెద బావ.

కృష్ణ పెద్ద కుమార్తె, మహేశ్‌ అక్క పద్మావతిని జయదేవ్‌ వివాహం చేసుకున్నారు. ఇటీవల పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం గళం విప్పి వార్తల్లో నిలిచిన ఆయన ఒక్కర్నే మహేష్ ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు.

పవన్ కళ్యాణ్
‘నేను ట్రెండ్‌ ఫాలో కాను. ట్రెండ్‌ సెట్‌ చేస్తా’… ‘గబ్బర్‌సింగ్‌’లో పవన్‌కల్యాణ్‌ చెప్పిన డైలాగ్‌ ఇది! ట్విట్టర్‌లోనూ ఆయనది అదే ఫిలాసఫీ. ఎవర్నీ ఫాలో కాకుండా నయా ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. పవన్‌కు రెండు ట్విట్టర్‌ ఖాతాలున్నాయి. ఒకటి… ఆయన పేరుతో క్రియేట్‌ చేసిన ‘పవన్‌కల్యాణ్‌’. ఇందులో ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన అంశాలు ట్వీట్‌ చేస్తారు.

రెండోది… సినిమాల కోసం క్రియేట్‌ చేసిన ‘పీకే క్రియేటివ్‌ వర్క్స్‌’. ఈ రెండు ఖాతాలకు ఫాలోయర్లు తప్ప, వాటి నుంచి పవన్‌ ఎవర్నీ ఫాలో కావడం లేదు!

ఎన్టీఆర్
ట్విట్టర్‌ రాజ్యంలో ఎన్టీఆర్‌ జై కొట్టింది ఒక్క జక్కన్నకు మాత్రమే! జక్కన్న అంటే రాజమౌళి. ఎన్టీఆర్‌కి ఇష్టమైన దర్శకుడు! ముద్దుగా ‘జక్కన్న’ అని పిలుస్తుంటారు. ఆయన ఒక్కర్నే ఎన్టీఆర్‌ ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు.

ఎన్టీఆర్‌, రాజమౌళి కాంబినేషన్‌లో ‘స్టూడెంట్‌ నెం1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ సినిమాలు వచ్చాయి. త్వరలో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.

అల్లు అర్జున్
ట్విట్టర్‌లో అల్లు అర్జున్‌ది సేమ్‌ టు సేమ్‌ నాగార్జున పాలసీనే! ప్రధాని నరేంద్ర మోదీని తప్ప మిగతావాళ్ళు ఎవర్నీ ఫాలో కావడం లేదు. సొంత సినిమాల గురించి తప్ప మిగతా అంశాల గురించి అరుదుగా ట్విట్టర్‌లో ప్రస్తావించే అల్లు అర్జున్‌ అప్పుడప్పుడూ మోదీ ట్వీట్స్‌ని రీట్వీట్‌ చేస్తుంటారు.