టీడీపీ విషయంలో పవన్ చేసిన తప్పేంటి..?
మూడు రోజుల మహానాడు వేదికగా.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సహా పార్టీ నాయకులు అందరూ మూకుమ్మడిగా.. బీజేపీపై విరుచుకు పడ్డారు. పనిలోపనిగా పవన్‌ను ఏకేశారు. కులం పేరుతో ప్రజల్లో విభేదాలు సృష్టించేందుకు `ఒకరు` ప్రయత్నిస్తున్నారంటూ.. పవన్‌ను దుయ్యబట్టారు. మరి నాలుగేళ్ల కాలంలో మిత్రుడిగా ఉన్న పవన్ విషయంలో చంద్రబాబుకు ఇప్పుడే నిజాలు తెలిసాయా? ఆయన కుల పిచ్చిగల వాడని ఇప్పుడే తెలిసిందా? అనేవి ప్రధాన ప్రశ్నలు. నిజానికి పవన్ ఇప్పటికీ టీడీపీకి మద్దతిచ్చి ఉంటే. . లేదా టీడీపీ అవినీతిపై మౌనంగా ఉండి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. కానీ, పవన్ ఇప్పుడు టీడీపీని ఏకేస్తున్నాడు.
బాబుకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెబుతున్నాడు. దీంతో టీడీపీ మరింతగా గందర గోళానికి గురై.. లేనిపోని ఆరోపణలు గుప్పిస్తోందని అంటున్నారు పరిశీలకులు.నిజానికి నాలుగేళ్ల పాటు తాను చంద్రబాబు ప్రభుత్వం అవినీతి, అభివృద్ధి చేయలేకపోవడం అనే అంశాలపై మౌనంగా ఉండటానికి కారణం వేచి చూడడమేనని పవన్ చెప్పాడు.
అంతేకాదు, లోకేష్‌పై చేసిన అవినీతి ఆరోపణలు కూడా వ్యూహాత్మకంగానే చేశాడు. ఈ విషయం చంద్రబాబుకు తెలియదని భావిస్తున్నానని, ఇప్పటికీ చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతుందని భావించవలసి ఉంటుందని జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.
అలాగే, ప్రత్యేక హోదాపై ఎన్నో రకాల మాటలు మార్చారని నేరుగానే విరుచుకుపడ్డాడు. కానీ, పవన్ కళ్యాణ్‌పై టీడీపీ నేతల ఎదురుదాడికి మాత్రం వారి వద్ద సమాధానం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, గత నాలుగేళ్లుగా ఆయన హెచ్చరికగానో లేక మృదువుగానో లేవనెత్తిన సమస్యలపై టీడీపీ సానుకూలంగా స్పందించింది. జగన్‌తో పోల్చుతూ జనసేనానిపై ప్రశంసలు కురిపించింది.
జగన్ ప్రతి సమస్యను రాజకీయం చేస్తున్నారని, పవన్ మాత్రం అలా కాదని, అందుకే ఆయన లేవనెత్తుతున్న సమస్యలపై స్పందిస్తున్నామని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో అన్నారు. కానీ, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వం అవినీతి అంటూ నిప్పులు చెరిగారో అప్పటి నుంచి ఎదురుదాడి చేస్తున్నారు. పవన్‌ను టార్గెట్ చేసుకోవడానికి వారికి సరైన ఆయుధాలు లేకుండా పోయాయని అంటున్నారు.
ఆయన ఇప్పుడే రాజకీయాలు ప్రారంభించడం అందుకు ఒక కారణం అయితే.. ఆయన లేవనెత్తిన అంశాలపై గతంలో సానుకూలంగా స్పందించి, ఇప్పుడు విమర్శలు చేస్తే ఇరకాటంలో పడినట్లేనని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అమరావతిలో భూముల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడం, టీడీపీ ఎంపీలపై ఆర్థికపరమైన విమర్శలు చేసినప్పటి నుంచి ఆయనను కూడా జగన్‌లా ప్రత్యర్థిలా భావిస్తే బాగుండేదని, ఇన్నాళ్లు ఆయనపై లేవనెత్తిన ప్రతి అంశంపై సానుకూలంగా స్పందించడం, నేతలపై ఆయన తీవ్ర విమర్శలు చేసినా అధిష్టానం ఆదేశాల మేరకు తగ్గడం.. నష్టం చేకూర్చిందని కొందరు భావిస్తున్నారు.
టీడీపీ నేతలపై గతంలో విమర్శలు చేసినప్పుడు చంద్రబాబు పవన్‌ను ఏమనవద్దని క్లాస్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు నేరుగా లోకేష్, ప్రభుత్వాన్ని విమర్శించడంతో ఎదురు తిరుగుతున్నారని అంటున్నారు.
ఓ విధంగా పవన్ కళ్యాణ్ నాలుగేళ్ల పాటు చంద్రబాబుకు అనుకూలంగా కనిపించారని, దీంతో టీడీపీ ఆయన పట్ల మౌనంగా ఉందని, కానీ జనసేనాని వ్యూహాత్మకంగా ఏడాదికి ముందు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారని, నాలుగేళ్ల పాటు కాపు ఓట్ల కోసం, యువత ఓట్ల కోసం పవన్ భ్రమలో ఉన్న టీడీపీ, ఇన్నాళ్లు ఆయన బుట్టలో పడిపోయి, ఇప్పుడు తీవ్ర విమర్శల తర్వాత మేలుకున్నారని అంటున్నారు. మొత్తంగా టీడీపీ విషయంలో పవన్ చేసిన తప్పేంటి? అంటే.. పాలనలోని లోపాలను ఎత్తి చూపడమే!! అని తేలిపోయింది.