Movies

కడుపుబ్బా నవ్వించిన కల్పనా రాయ్ నిజ జీవితంలో ఎన్ని కష్టాలో… ఎలాంటి స్థితిలో చనిపోయిందో తెలుసా?

ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి,సుఖాలు ఉంటాయి . ఇక కొంతమందికైతే కష్టాల కడగండ్లు వెంటాడుతూనే ఉంటాయి. జీవితమంతా కష్టాల్లో కరిగిపోతుంది. ఇది చూస్తే చాలామందికి బాధ కలుగుతుంది. ఇక వెండితెరపై కనిపించే నటీనటులు కష్టాల్లో ఉంటే బాధ మరింత హెచ్చుతుంది. దీనికి కారణం చాలామంది అభిమానులు కుటుంబం కంటే , నటీనటులనే ఎక్కువగా అభిమానిస్తుంటారు. మరికొందరు కుటుంబ సభ్యుల్లా చూస్తారు. అందుకే ఎక్కువ స్పందన ఉంటుంది. ఇక వెండితెరపై మనల్ని కడుపుబ్బా నవ్వించి,తమ జీవితాలను కన్నీటి కథలుగా మిగుల్చుకున్నవాళ్లూ వున్నారు. అందులో కల్పనారాయ్ ఒకరు. తాను చనిపోయే సమయంలో కూడా కష్టాలు ఎదుర్కొని కన్నీళ్లు పెట్టించిన నటి కల్పనా రాయ్ అసలు పేరు సత్యవతి.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సూర్యనారాయణ పురంలో 1940లో జన్మించిన కల్పనారాయ్ కి పదేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు మరణించారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్లిన ఆమెకు ఆమె అక్క తోడుగా నిలిచింది. రంగ స్థలం మీద ఉన్న అనుభవంతో 1972లో ఓ సీత కథ మూవీతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయింది. దాదాపు 500 లకు పైగా చిత్రాల్లో తన నటనతో ముఖ్యంగా హాస్యంతో అందరినీ గిలిగింతలు పెట్టింది.

ఆమె తెరమీద కనిపిస్తే చాలు నవ్వులు పూసేవి. ఆమె మేనజరిజం తో హాస్యం ఫై ప్రత్యేక ముద్ర వేసింది. అయితే సినిమా పాత్రల మాదిరిగానే ఆమె నిజ జీవితంలో కూడా కల్లా కపటం,కల్మషం తెలీని మనిషి. అందుకే సినిమాలలో బిజీ గా ఉంటూ సంపాదించిన సొమ్మును తన దగ్గరికి సాయం కోసం వచ్చిన వాళ్లకు లేదనకుండా సహాయం చేసింది.

గుప్తంగా దానధర్మాలు చేసిన కల్పనారాయ్ కి సినిమాల్లో అవకాశాలు తగ్గడం,చేతిలో చిల్లి గవ్వ లేక, ఆమె పడిన కష్టాలు వర్ణనాతీతం. ఇక ఆమె వయస్సు అనుభవం తెచ్చిందో లేదో గానీ అనారోగ్యం మాత్రం తెచ్చిపెట్టింది. ఆవిధంగా మూత్ర పిండాలు, గుండె వ్యాధుల బారినపడి, ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడింది.

ఆలా చివరి దశలో కష్టాల కడగండ్లు మిగుల్చుకుని, ఆదుకునేవాళ్ళు లేక చివరకు కన్నుమూసింది. ఆమె చివరి రోజుల్లో ఎవరూ తనను చూడ్డానికి కూడా రాకుండా ముఖం చాటేసినా సరే, బాధను గుండెల్లోనే దిగమింగుకుని,కన్నీళ్లు కనిపించకుండా, దొడ్డమనసు చాటుకుంటూ,శాశ్వతంగా ఈలోకం విడిచి వెళ్ళింది. ఇక అంతిమ సంస్కారానికి కూడా డబ్బుల్లేక తోటి కళాకారులు చందాలేసుకుని తతంగం నడిపించారు. అందుకే ఆమె జీవితం చూస్తే, ఎలా పోయామన్నదే ముఖ్యం అనిపిస్తుంది.