Movies

కైకాల సత్యనారాయణగారు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో…ఏమి చేస్తున్నారో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో విలనిజం అద్భుతంగా పండించి,కమెడియన్ పాత్రలోనూ మెప్పించి, పెద్ద తరహా పాత్రలతో విషాదం కూడా చూపించి,ఇలా ఒకే నటుడు ఇన్ని రకాలుగా చేయగలడా అంటే అవును అనడానికి సజీవ తార్కాణం కైకాల సత్యనారాయణ. దాదాపు 5 దశాబ్దాలుగా వందలాది చిత్రాల్లో పనిచేసిన ఈయన మూడు తరాల వారితో కల్సి నటనను పంచుకున్నారు. అయితే ఈయన నటించిన మొదటి చిత్రం అట్టర్ ప్లాప్ అయింది. అయితే ఆతర్వాత నుంచి వెను తిరిగి చూడకుండా, అది పౌరాణికం కావచ్చు, సాంఘికం కావచ్చు,జానపదం కావచ్చు, చారిత్రకం ఏదైనా సరే, విభిన్న పాత్రలతో మెప్పించి ఆయా పాత్రలలో జీవించిన కైకాల విశ్వ విఖ్యాత నవరస నటనా సార్వభౌమునిగా కీర్తిగాంచారు.

తనలోని నవరసాలను పలికిస్తూ తెలుగు వెండితెరపై సత్యనారాయణ అద్భుత నటునిగా నిలిచారు. గంభీరమైన కంఠం,నిప్పులు కురిపించే కళ్ళు,ఏ పాత్ర వేసినా, అందులో లీనమయ్యే ఆహార్యం, నిండైన విగ్రహం ఆయన సొంతం. అవే ఆయనకు అసలైన ఆభరణాలు. అందుకే ఆయన ఏ పాత్ర పోషించినా అది తెరపై పండేది.

అన్ని పాత్రలలో ఒదిగి, ఆ పాత్రలకు జీవం పోశారు. ఈ పాత్ర కైకాల మాత్రమే వేయగలడని చెప్పడానికి ఎన్నో పాత్రలు మచ్చు తునకలు.
1959లో వచ్చిన సిపాయి కూతురు మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన కైకాల కృష్ణా జిల్లా కౌతరం గ్రామంలో 1935జులై 25న జన్మించారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలతో నెట్టుకొచ్చినప్పటికీ, రాను రాను తనని దృష్టిలో వుంచుకుని పాత్రలు రూపకల్పన చేసేస్థాయికి చేరుకున్నారు.

పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఎన్టీఆర్ కి సమ ఉజ్జీగా నిలిచే విలనిజం పండించిన ఈయన , ఎస్వీ రంగారావు తర్వాత అంతటి స్థాయిని పొందారు. ఎస్వీఆర్ తర్వాత ఘటోత్కచుడు పాత్రలో నటించి మెప్పించారు ఈయన. ఇక యమ ధర్మరాజు పాత్ర వేయాలంటే సత్యనారాయణ మాత్రమే వేయాలని ఎవ్వరినీ అడిగినా అప్పుడేకాదు ఇప్పుడు కూడా చెప్పేమాట. యమగోల,యముడికి మొగుడు, యమలీల వంటి చిత్రాలు విజయవంతం అయ్యాయంటే అందుకు యమ పాత్రలో సత్యనారాయణ చూపిన అద్భుత నటన కారణం అని చెప్పవచ్చు.

రావణ, దుర్యోధన,వంటి పాత్రలను ఎన్టీఆర్, ఎస్వీఆర్ తర్వాత మెప్పించిన నటుడు కైకాల 1996లో రాజకీయాల్లోకి వచ్చి, మచిలీ పట్నం లోక సభ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. రాజకీయాల్లో కొద్దికాలం మాత్రమే రాణించిన సత్యనారాయణ ఇప్పటికీ తనకు తగ్గ పాత్రలు వస్తుంటే పోషిస్తూ, అందరినీ ఇంకా తన నటనతో అలరిస్తున్నారు కైకాల సత్యనారాయణ. తనకు ఫలానా పాత్ర కావాలని ఎన్నడూ అడగలేదు సరికదా,తన పిల్లలను సినిమాల్లోకి వెళ్ళమని కూడా బలవంతం చేయలేదు.

ఉత్తమ విలన్ గా, ఉత్తమ క్యారక్టర్ నటునిగా నంది బహుమతులు అందుకున్న కైకాల ను ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. ఎన్నో సంస్థలు సత్కరించాయి. ఎపి ప్రభుత్వం 2011లో రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది .