Devotional

సెప్టెంబర్ 9 న పొలాల అమావాస్య రోజు సంతానం లేని వారు ఇలా చేస్తే సంతానం కలుగుతుంది… పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు

దీనిని శ్రావణ మాసంలోని బహుళ పక్ష అమవాస్యనాడు ఆచరిస్తారు. ఈ అమవాస్యకు ‘పోలామావాస్య‘ అనిపిలుస్తారు. దీనికే ‘పోలాల అమవాస్య, పోలాంబవ్రతం’ వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు ‘అపమృత్యు భయం’ తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పబడుతూ ఉంది. ఈ పండుగను దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. అసలు పొలాల అమావాస్య ఎలా జరుపుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

పొలాల అమావాస్యకు ముందు రోజు ఒక కంద మొక్క లేదా కంద పిలకను తెచ్చుకోవాలి.పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరి కాయ ఒకటి, పసుపు కొమ్ములు రెండు, అరడజను అరటి పళ్ళు పూజకు అవసరం అవుతాయి. పొలాల అమావాస్య రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానము చేసి దేవుడి మందిరంలో కంద మొక్క లేదా కంద పిలకను పెట్టి పసుపు,కుంకుమ బొట్లు పెట్టాలి.

పసుపుతో వినాయకుణ్ణి,గౌరీ దేవిని చేసుకొని తమలపాకు మీద పెట్టి కంద మొక్క దగ్గరగా పెట్టాలి. నైవేద్యంగా వడ పప్పు, పానకం, చలిమిడి,పళ్ళు,కొబ్బరికాయలు, సంతానం కలవారు గారెలు, మగ సంతానం కల వారు బూరెలు సిద్దం చేసుకోవాలి. ఇద్దరు వున్నవారు రెండూ సిద్దం చేసుకోవాలి. రెండు దారం పోగులకు పసుపు రాసి పసుపు కొమ్ములు కట్టి రెడీ చేసుకోవాలి. ఈ వ్రత కథ ప్రతి స్త్రీల వ్రత కథల పుస్తకంలో కనిపిస్తుంది. ఆ పుస్తకం కూడా దగ్గర పెట్టుకోండి.

అన్ని పూజలను చేసుకొనే విధంగానే ముందుగా ఆచమనం చేసుకుని, సంకల్పం చెప్పుకుని గణపతి పూజ చేసుకుని అమ్మ వారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. పసుపు అమ్మ వారిని, కంద మొక్క లేక కంద పిలకని, కుంకుమతో పుష్పాలతో పూజ చేసి, దీప, ధూప, నైవేద్యాలు సమర్పించి, అక్షింతలు చేత పట్టుకుని, వ్రత కథ చదువుకుని, కొన్ని అక్షతలు అమ్మ వారి మీద, కొన్ని కుటుంబ సభ్యుల అందరి మీద జల్లు కోవాలి.

కథ పూర్తీ అయ్యాక,పసుపు కొమ్ము కట్టిన ఒక దారం అమ్మ వారి దగ్గర ఉంచి, ఇంకో దారం పూజ చేసిన స్త్రీ మెడలో కట్టు కోవాలి. తీర్థ ప్రసాదాలు భక్తి తో స్వీవీకరించాలి.